McDonald Fined: ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌కు అమెరికా కోర్టు భారీగా ఝలక్ ఇచ్చింది. ఆ సంస్థ తయారు చేసిన చికెన్ నగ్గెట్స్ తింటూ గాయపడిన చిన్నారికి ఏకంగా 8,00,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.6.5 కోట్లు పైనే) చెల్లించాలని ఆదేశించింది. 
ఏం జరిగిందంటే
2019లో ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లొరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ సమీపంలో మెక్‌డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కు వెళ్లింది. హ్యాపీ మీల్‌ కింద చికెన్ నగ్గెట్స్ కొనుగోలు చేసింది. కారులో తినేందుకు బాక్స్‌ తెరవగా వేడిగా ఉన్న ఓ నగ్గట్‌ ఆమె కాలుపై పడి కాలిపోయింది. భయంతో ఎక్కిళ్లు పట్టి ఏడ్చింది. చిన్నారి బాధ చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మెక్‌డొనాల్డ్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫ్లొరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
నగ్గెట్ పడి చిన్నారి అయిన గాయం ఫొటోలు, పాప ఏడుస్తున్న ఆడియోను ఆధారాలుగా కోర్టుకు సమర్పించారు. 15 లక్షల డాలర్లు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. మెక్‌డొనాల్డ్స్‌ తరఫున లాయర్‌ వాదిస్తూ.. కాలిన గాయం మూడు వారాల్లో తగ్గిపోయిందని, నొప్పి కూడా లేదని బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారని జడ్జికి వివరించారు. బాలికకు 1.56లక్షల డాలర్లు సరిపోతాయని వాదించారు. చిన్నారి ఇప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లకు వెళ్లి చికెన్‌ నగెట్లను తింటోందని చెప్పారు.
అది మా బాధ్యత కాదు
మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ఆహార భద్రతా నియమాలను అనుసరిస్తుందని, సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి నగ్గెట్‌లు తగినంత వేడిగా ఉండడానికి వేడిగా ఉంచుతామని వివరించింది. ఆహారం బయటకు వెళ్లిన తరువాత అది తమ పరిధిలో ఉండదన్నారు. ఆహార భద్రతా నియమాల మేరకు ఆహారం వేడిగా ఉంచడం తమ తప్పు కాదని వాదించారు. బాలిక తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ.. చిన్నారి అయిన గాయానికి అప్ క్రంచ్, మెక్‌డొనాల్డ్స్ సంస్థలు బాధ్యత వహించాల్సిందేనని వాదించారు. పస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తీర్పు వెలువరించాలని కోరారు. చిన్నారి హక్కులను సంస్థలు హరించేందుకు యత్నించాయని వివరించారు.
8 లక్షల డాలర్లు చెల్లించాలని తీర్పు
వాదనలు విన్న న్యాయస్థానం ఆహరం వేడిగా ఉందని హెచ్చరికలు చేయడంలో సదరు కంపెనీ విఫలమయ్యారని, అది పిల్లల గాయానికి దారితీసిందని గుర్తించింది. మెక్‌డొనాల్డ్స్‌ లాయర్ వాదనలను దోచిపుచ్చిన న్యాయస్థానం ఆ చిన్నారికి పరిహారంగా నాలుగు లక్షల డాలర్లు.. ఆమె భవిష్యత్తు కోసం అదనంగా మరో నాలుగు లక్షల డాలర్లు, మొత్తం 8 లక్షలు చెల్లించాలని మెక్‌డొనాల్డ్స్‌ను ఆదేశించింది.  కోర్టు తీర్పు గురించి ఆమె న్యాయస్థానం బయట మాట్లాడారు. కోర్టులో చిన్నారికి  న్యాయం కోసం పోరాడినన తమకు న్యాయం జరిగిందన్నారు.


న్యాయవాదులు మాట్లాడుతూ ఈ తీర్పు కఠినమైన, సుదీర్ఘమైన ప్రక్రియకు ముగింపు పలికిందన్నారు. చేసిన తప్పును సంస్థలు అంగీకరించలేదని, ఈ విచారణ సమయంలో, సమాజం దృష్టిలో చిన్నారి ఒలివియా బాధను అణగదొక్కడానికి ప్రయత్నించారని చెప్పారు. వారి ప్రయత్నాలు న్యాయస్థానం తీర్పుతో నీరుగారిపోయాయని చెప్పారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial