Solar Storms To Hit Earth: అసలే భూమిపై ఏర్పడే తుఫాన్లతోనే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క సారి తుఫాన్ వస్తే వేలాది మంది తిండి, గుడ్డ, గూడు కోసం నానా అవస్థలు పడుతున్నారు. అదే సౌరవ్యవస్థలో తుఫాన్ ఏర్పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సౌరవ్యవస్థ నుంచి భవిష్యత్తులో భూమికి ముప్పు పొంచి ఉంది. అంతరిక్ష తుఫానులు మానవాళి జీవితంపై ప్రభావం చూపనున్నాయి. 


ఈ తుఫానుల నుంచి వచ్చే రేడియేషన్ శాటిలైట్లు, రేడియో తరంగాలపై ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సంస్థ అంచనా వేసింది. NOAA తాజా అంచానా ప్రకారం శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకనుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) కారణంగా రేడియో, GPS, శాటిలైట్ కమ్యూనికేషన్‌లను ప్రభావితం చేసే జియోమాగ్నెటిక్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయని, అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త తమితా స్కోవ్ X (గతంలో Twitter)లో తెలిపారు. ఈ సౌర తుఫాన్‌ను NOAA G2గా వర్గీకరించింది. G3 కేటగిరికి చెందిన తుఫానులు శక్తివంతమైనవిగా ఉంటాయని స్కోవ్ చెప్పారు.






NOAA ప్రకారం నవంబర్ 27న CME ద్వారా సౌర తుఫానులు ఏర్పడ్డాయి. ఇది మరింత బలమైన భూ అయస్కాంత తుఫానుకు దారి తీస్తుంది. సూర్యుని ఉపరితలంపై ప్లాస్మా విద్యుదయస్కాంత కణాలను మండించినప్పుడు సౌర మంటలు ఏర్పడతాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం, రాబోయే సౌర తుఫాను నవంబర్ 30 రాత్రి భూమిని తాకిందని, డిసెంబర్ 1, శుక్రవారం తెల్లవారుజామున ముగుస్తుందని అంచనా వేశారు. కరోనల్ మాస్ ఎజెక్షన్లు (CMEలు) అనేవి సూర్యుడి నుంచి వచ్చిన కణాలతో ఏర్పడిన భారీ మేఘాలని, ఇవి భూమి సాంకేతిక, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాయని NOAA వెల్లడించింది.


శాటిలైట్ కమ్యునికేషన్, రేడియో సంకేతాలకు అంతరాయం కలిగిస్తాయని, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని, GPS వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది. భవిష్యత్తులో రాబోయే సౌర తుఫాను ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేసింది. అయితే హై లాటిట్యూడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు చిన్నపాటి అంతరాయాలను కలిగిస్తుందని వెల్లడించింది. ఈ సౌర తుఫానులతో నేరుగా మానవ ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పును కలిగి ఉండవని, కానీ అత్యంత శక్తివంతమైన తుఫానులు జీవుల మనుగడపై ప్రభావం చూపగల హానికరమైన రేడియేషన్‌ను విడుదల చేయగలవని NOAA వెల్లడించింది. అదృష్టవశాత్తూ, భూమి ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్  ఈ రేడియేషన్ ప్రభావం నుంచి మానవాళిని కాపాడుతుందని, మానవులపై దాని ప్రభావాన్ని తగ్గిస్తుందదని శాష్త్రవేత్త  తమితా స్కోవ్ తెలిపారు.