పెళ్లికి అతిథులుగా వచ్చిన వారి దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఇలా నిజంగా జరిగింది. కానీ ఇది అంతకన్నా ఆశ్చర్యమైనది. పెళ్లి రిసెప్షన్‌కి అతిథిగా రాకపోయినా ఓ వ్యక్తికి నిర్వహకులు ఇన్‌వాయిస్ (బిల్లు) పంపారు. ఈ ఘటన జమైకా దేశంలోని నెగ్రిల్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఇన్‌వాయిస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి రిసెప్షన్‌కు రాకపోయినా ఏకంగా రూ.240 డాలర్లు (రూ.17,700) ఇన్ వాయిస్ పంపడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు.


అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతిథి పెళ్లికి హాజరవుతానని చెప్పారట. కానీ, హాజరు కాలేదు. ఆ పెళ్లి రిసెప్షన్‌లో డిన్నర్ కూడా అసలే చేయలేదు. అంతమాత్రానికే బిల్లు పంపేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే, ఆ ఇన్‌వాయిస్‌లో ఏం చెప్పారో తెలిస్తే మరింత దిమ్మతిరుగుతుంది. పెళ్లికి హాజరవుతానని ముందే చెప్పారని సీట్లు కన్ఫామ్ చేసేశాం. కానీ, మీరు పెళ్లికి రాలేదు. అయినా ఆ బుక్ చేసిన సీట్లకు మేం డబ్బులు పే చేశాం. కాబట్టి ఈ బిల్లు మీరే చెల్లించాలి’’ అని వివాహ నిర్వహకులు అతిథికి పంపిన ఆ ఇన్‌వాయిస్‌లో పేర్కొన్నారు.


వివాహ రిసెప్షన్‌కు వచ్చే అతిథులకు బుక్ చేసిన సీట్లలో ఒక్కో సీట్‌కు అయిన ఖర్చు 120 డాలర్లు. అలా ఆ అతిథి కుటుంబం హాజరు కాలేదు కాబట్టి.. వారి రెండు సీట్ల కోసం ఖర్చయిన 240 డాలర్ల బిల్లును అతిథికి పంపడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పైగా ఎలా ఆ డబ్బును చెల్లించాలో కూడా ఆప్షన్లను ఆ బిల్లులో పేర్కొన్నారు. వాళ్లు స్థానిక పేమెంట్ యాప్‌లయిన జెల్లీ, పేపాల్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. అయితే, ఏ యాప్ ద్వారా చెల్లిస్తారో ముందుగానే తమకు తెలపాలని ఓ నిబంధన కూడా పెట్టారు. ఆగస్టు 18న జారీ అయిన ఈ ఇన్‌వాయిస్ ఇప్పుడు ట్విటర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇది ట్విటర్‌లో చూసిన నెటిజన్లు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు పంపిన వధువును ఒక పిసినారిగా అభివర్ణిస్తున్నారు. మరో ట్విటర్ యూజర్ కామెంట్ చేస్తూ.. ‘‘వివాహ ఆహ్వానాన్ని అంగీకరించడం అనేది లీగల్ కాంట్రాక్ట్ కాదు కదా. అది సామాజిక కాంట్రాక్ట్ లాంటిది. కానీ, ఇలా బిల్లు పంపడం అనేది పనికిమాలినది. అది కూడా ఈ పాండమిక్ టైంలో జరిగిన వివాహ పార్టీకి.’’ అని కామెంట్ చేశారు. మరో యూజర్ స్పందిస్తూ వధువు గొప్ప పిసినారి అని ఎద్దేవా చేశారు. ఇంకొకరు స్పందిస్తూ.. డబ్బు వసూలు చేయడం కోసం గుడ్ లక్ అని కామెంట్ చేశారు.