Lunar Samples Show : చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న సహజ ఉపగ్రహం. కొన్ని దశాబ్దాలుగా చంద్రునిపై జీవించే అవకాశం కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది. చంద్రునిపై విస్తరించిన చిన్న గాజు పూసల లోపల నీరు ఉండవచ్చని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది.


ఇది భ‌విష్య‌త్‌లో చంద్రుని గురించి జ‌రిపే ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క విష‌యంగా మార‌టంతోపాటు.. విలువైన వనరుల‌ ల‌భ్య‌త‌ను తెలిపే అంశాన్ని సూచిస్తుంది. శాస్త్రవేత్తలు చంద్రుడిని చాలా కాలంపాటు ఎడారిగా భావించారు. అయితే, గత కొన్ని దశాబ్దాల నుంచి చంద్రునిపై నీరు ఉన్నట్టు రుజువు చేసే ఇలాంటి గుర్తులు చాలా కనుగొనబడ్డాయి.


చంద్రుని ఉపరితలంపై నీరు ఉందని, అది ఖనిజాల లోపల చిక్కుకుపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2020 సంవత్సరంలో, చైనా చంద్రునిపై శోధించడానికి మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ పేరు రోబోటిక్ చాంగ్-5. ఆ సమయంలో చంద్రునిపై మట్టిని సేక‌రించి భూమిపైకి తీసుకువచ్చారు. దీనిపై సోమవారం (మార్చి 27) శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ మట్టి నమూనాల విశ్లేషణలో ఈ గాజు గోళాలు కరిగిపోయి చల్లగా ఉన్నట్లు తేలింద‌ని తెలిపారు. చంద్రుని ఉపరితలంపై నీటి అణువులను అవి తమలో దాచుకున్నాయ‌ని పేర్కొన్నారు.


చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్ శాస్త్రవేత్త సెన్ హు మాట్లాడుతూ.. చంద్రుడిపై మైక్రోమీటోరాయిడ్‌లు, పెద్ద ఉల్కలు నిరంతరం ఢీకొంటాయని చెప్పారు. వాటి తాకిడి సమయంలో, అధిక శక్తి ఉత్పత్తి అవుతుంద‌ని ఇది వాటర్ గ్లాస్ తయారీలో సహాయపడుతుంద‌ని తెలిపారు. నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనా పత్రానికి సెన్ హు సహ రచయితగా ఉన్నారు.


చంద్రుని ఉప‌రితలంపై ఉండే ఆక్సిజన్‌తో సోలార్ హైడ్రోజన్ ప్రతిచర్య ద్వారా సౌర గాలి ఉత్పన్నమై నీరు ఉత్పత్తి అవుతుంద‌ని హు చెప్పారు. ఈ గాజు గోళాలు నీటిని స్పాంజిల్లా పీల్చుకుంటాయ‌ని తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడిపై అన్వేషణ స‌మ‌యంలో సుదీర్ఘ కాలం ప‌రిశోధ‌న‌లు చేసే వ్యోమగాములకు నీరు చాలా ముఖ్య‌మైన‌ది. ఇది కేవ‌లం తాగునీరు మాత్ర‌మే కాదు ఇంధ‌నంగా ప‌నిచేస్తుంది. భూమి త‌ర‌హాలో చంద్రునిపై నీటి జాడ‌లు క‌నిపించ‌క‌పోయినా.. చంద్రుడి ఉప‌రిత‌లంపై నీటి వ‌న‌రులు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. 


"గ్రహ ఉపరితలాల యొక్క స్థిరమైన అన్వేషణను అందుబాటులోకి తీసుకురావ‌డానికి నీరు ముఖ్య‌మైన వ‌న‌రు. చంద్రుని ఉపరితలం మీద‌ నీరు ఎలా ఉత్పత్తి చేయబడుతుందో, నిల్వ చేయబడి, తిరిగి నింపబడుతుందో తెలుసుకోవడం భవిష్యత్ అన్వేషకులకు చాలా అవ‌స‌రం. ఆ నీటిని వెలికితీసేందుకు, అన్వేషణ ప్రయోజనాల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది" అని హు చెప్పారు.