Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వంతెన పైనుంచి వెళ్తున్న బస్సు పక్కనే ఉన్న వాల్‌ను  ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


సౌదీ అరేబియాకు నైరుతిలో ఉన్న అసిర్ ప్రావిన్సులోని 14 కిలో మీటర్ల పొడవైన అకాబత్ షార్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు బస్సు ఖమీస్ ముషైత్ నుండి అభాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రహదారి పర్వతాల గుండా వెళ్తుంది. అలాగే 11 సొరంగాలు, 32 వంతెనలను కల్గి ఉంది. బస్సు బ్రిడ్జిపైకి వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో వంతెన చివర ఉన్న వాల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే చనిపోగా... మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వారికి సహాయం చేశారు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. బస్సు ప్రమాదానికి గురికాగానే బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 



 పది రోజుల క్రితం బంగ్లాదేశ్ లో లోయలో పడ్డ బస్సు - 17 మంది మృతి..


బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. దగ్గర్లోని పలు ఆసుపత్రులకు వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఓ టైర్ పేలిపోయి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు స్థానిక మీడియా చెబుతోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు. బంగ్లాదేశ్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి రహదారుల నిర్మాణంలో లోపాలున్నాయని, డ్రైవర్‌లకూ సరైన రీతిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. 


గత నెలలో పాకిస్థాన్ లో ప్రమాదం - 12 మంది దుర్మరణం


పాకిస్థాన్ లో ఫిబ్రవరి 20వ తేదీన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కల్కర్హార్ సాల్ట్ రేంజ్ ప్రాంతంలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 50 మంది గాయపడినట్లు సమాచారం. ఈ బస్సు ఇస్లామాబాద్ (ఇస్లామాబాద్) నుంచి లాహోర్ వెళ్తోంది. బస్సు బ్రేక్ అకస్మాత్తుగా ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.