Amritpal Singh: భారత్ లో పరారీలో ఉన్న అమృత్ పాల్ కోసం దర్యాప్తు సంస్థలు, భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నేపాల్ కు పారిపోయి ఉండొచ్చనన్ అనుమానాల మధ్య భారత్ అభ్యర్థన మేరకు నేపాల్ అధికారులూ అమృత్ పాల్ సింగ్ కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయమే నేపాల్ ప్రభుత్వానికి భారత రాయబార కార్యాలయం లేఖ రాసింది. అమృత పాల్ సింగ్ నేపాల్ లో దాక్కుని ఉండొచ్చని లేదంటే నేపాల్ నుంచి ఇతర దేశాలకు పారిపోయి ఉండొచ్చని తెలిపారు. ఇందుకోసం నేపాల్ రాయబార కార్యాలయం నేపాల్ భద్రతా సిబ్బందికి అమృత్ పాల్ కు చెందిన విభిన్న చిత్రాలను కూడా పంపించారు. అమృత్ పాల్ తన పాస్ పోర్టుతో లేదంటే ఏదైనా నకిలీ పాస్ పోర్టుపై ప్రయాణించి ఉండొచ్చని రాయబార కార్యాలయం రాసిన లేఖలో పేర్కొంది. అమృత్ పాల్ నేపాల్ నుంచి దుబాయ్, ఖతార్, సింగపూర్, బ్యాంకాక్ లకు పారిపోవాలని యోచిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై నిఘా ఉంచాలని కోరారు.
భారత నిఘా సంస్థ ఏం చెబుతోంది?
నేపాల్ లోని పాక్ రాయబార కార్యాలయం సహాయంతో అమృత్ పాల్ నకిలీ పాస్ పోర్టు సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడని భారత ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాత, నేపాల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో, అన్ని స్టేషన్ల దర్యాప్తు ప్రక్రియను కఠినతరం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచింది. భారతదేశం నుంచి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తోంది. అనుమానాల ఆధారంగా నేపాల్ పోలీసులు పలు చోట్ల నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. నేపాల్ లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు హై అలర్డ్ లో ఉన్నాయి. ఖాట్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయం, భైరహవాలోని గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పరారీలో ఉన్న అమృత్ పాల్ ఫోటో నేపాల్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజ్ లు, లాడ్జీలలో ప్రచారం చేస్తున్నారు.
దుబాయ్ లోనే ఐఎస్ఐ శిక్షణ
చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనలు రేపడానికే అమృత్ పాల్ దేశంలోకి అడుగుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారిస్ పంజాబ్ దేలో చేరి చాలా వేగంగా ఎదిగాడు. దీంతో పాటు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా అమృత్ పాల్‌కు సంబంధాలు ఉన్నాయి.