Suicide Drone Tested In North Korea రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై యావత్ ప్రపంచం దృష్టి సారించగా నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఉత్తర కొరియా అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సూసైడ్ డ్రోన్‌ను పరిశీలించారు. అందుకు సంబందించిన ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ డ్రోన్లను తయారు చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. భూ ఉపరితలం, సముద్ర ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే విధంగా వాటిని అభివృద్ధి చేశారు. పూర్తిగా తెలుపు రంగులో ఉండే ఆ డ్రోన్లకు చివర్లో X ఆకారంలో ఉండే రెక్కలున్నాయి. కొరియా అధికారిక మీడియా దీనికి సంబంధించి ఫొటోలతో కూడిన వీడియోను విడుదల చేసింది.
డ్రోన్ పనితీరును ఆ దేశాధ్యక్షుడు కిమ్ పరిశీలించారు. పంట పొలాల మధ్యన ఉన్న యుద్ధ ట్యాంకును ఈ సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేయడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. తెలుపు రంగులో ఉండే ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వెళ్లి యుద్ధ ట్యాంకును ఢీకొట్టడం, వెంటనే భారీ పేలుడు సంభవించడం వీడియోలో కనిపిస్తుంది. ఒక డ్రోన్ లక్ష్యంపై దాడి చేస్తే, కొసి పేలిపోతుంటే కొన్ని డ్రోన్లు దాడి చేసి తిరిగి వెనక్కి రావడం కనిపిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేసి సైన్యానికి అందించాలని కిమ్ ఆ దేశ ఉన్నతాధికారులను ఆదేశించారు.
దక్షిణ కొరియా, అమెరికా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సూసైడ్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎప్పటికప్పుడు అమెరికాకి హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియా.. తాజా ప్రయోగంతో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసినట్టయింది. అమెరికాలోని లక్ష్యాలను సైతం చేదించగల దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం సిద్ధం చేసే పనిలో ఉత్తరకొరియా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాబోయే రెండు నెలల్లో అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కిమ్ ఈ ప్రయోగం చేసినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ దేశంలో అణ్వస్త్ర సంపదకు కొదువ లేదని ప్రకటించడమే ఈ ప్రయోగం వెనుక ఉద్దేశ్యం అయ్యుండొచ్చని తెలుస్తోంది. సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ సూసైడ్ డ్రోన్ ఉపయోగపడుతుందని ఆ దేశం భావిస్తోంది.