Terrorists Attack on Bus In Pakistan: పాకిస్థాన్‌లో (Pakistan) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొందరు సాయుధులు రహదారిపై బస్సులు, ట్రక్కులను అడ్డగించి ప్రయాణికులను కిందకు దింపి దాదాపు 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగినట్లు డాన్ మీడియా సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల ప్రకారం.. ముసాఖెల్ జిల్లా రరాషమ్‌లోని రహదారిపై సోమవారం కొందరు సాయుధులు హల్చల్ చేశారు. అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కులను అడ్డగించి ప్రయాణికుల్ని కిందకు దించేశారు. అనంతరం వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేసి.. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతేకాకుండా దాదాపు 10 వాహనాలకు నిప్పు పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 23 మంది మరణించారు. అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
వారే లక్ష్యంగా..
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు (Punjab Province) చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్పరాజ్ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read: Crime News: పుచ్చకాయల్లో డ్రగ్స్ సరఫరా, అనుమానం వచ్చి పోలీసులు చెక్ చేయగా!