Telangana ICET 2024 Counselling Schedule: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీజీఐసెట్ కౌన్సెలింగ్ పేపర్ ప్రకటన ఆగస్టు 26న విడుదలైంది. దీనిప్రకారం సెప్టెంబరు 1 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. మొదటి, చివరి విడతల కౌన్సెలింగ్ అనంతరం ప్రవేశాల కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు, చివరి విడత కౌన్సెలింగ్‌‌ను సెప్టెంబరు 20 నుంచి సెప్టెంబరు 28 వరకు నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్, పూర్తిస్థాయి ప్రవేశాల నోటిఫికేషన్ ఆగస్టు 27 నుంచి అందుబాటులో ఉండనుంది. 


మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబరు 3 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు సెప్టెంబరు 4 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబరు 14న తొలివిడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 14 నుంచి 17 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.


ఆగస్టు 24న ఐసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యామండలి, ప్రవేశాల కమిటీ ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్‌ ఎ శ్రీదేవసేన, విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్‌కే మహమూద్, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ నరసింహాచారి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 


ఈ ఏడాది జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77,942 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 64 ఎంసీఏ కాలేజీల్లో 6990 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


తెలంగాణ ఐసెట్‌ 2024 తొలి విడత షెడ్యూల్‌ ఇదే..
➥ సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌.
➥ సెప్టెంబరు 3 నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన.
➥ సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.
➥ సెప్టెంబరు 14వ తేదీన సీట్ల కేటాయింపు 
➥ సెప్టెంబరు 14 నుంచి 17వ తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌.


కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
✦ TS ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, tsicet.nic.inకి వెళ్లండి.
✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.
✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
✦ అవసరమైన వివరాలను నింపాలి.
✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.
✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.


ఈ డాక్యుమెంట్లు అవసరం..
✦  ఐసెట్-2024 ర్యాంకు కార్డు
✦  ఐసెట్-2024 హాల్‌టికెట్
✦  ఆధార్ కార్డు
✦  పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో
✦  ఇంటర్ లేదా తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికేట్
✦  డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజినల్ సర్టిఫికేట్
✦  9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు
✦  ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
✦  ఇన్‌కమ్ సర్టిఫికేట్
✦  ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్
✦  ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్-క్యాస్ట్ సర్టిఫికేట్(అవసరమైనవారికి)
✦  రెసిడెన్స్ సర్టిఫికేట్
✦  నాన్-లోకల్ సర్టిఫికేట్
✦  రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే, వారి ఎంప్లాయర్ సర్టిఫికేట్
✦  క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్


Website



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..