Kim Jong Un:
ఇక యుద్ధమే..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్‌కి సిద్ధమవుతున్నారు. మిలిటరీ టాప్ జనరల్‌ని డిస్మిస్ చేసిన ఆయన యుద్ధానికి రెడీగా ఉండాలంటూ మిలిటరీకి పిలుపునిచ్చారని అక్కడి మీడియా వెల్లడించింది. ఆయుధాలు సమకూర్చుకోవడం సహా మిలిటరీ డ్రిల్స్ కూడా జరుగుతున్నాయి. సెంట్రల్ మిలిటిరీ కమిషన్ మీటింగ్‌లో కిమ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫలానా దేశం అని పేరు ఎత్తకుండానే ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండాలని సైన్యానికి తేల్చి చెప్పినట్టు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం మిలిటరీ టాప్ జనరల్ పదవిలో ఉన్న అధికారిని తప్పించి వేరే అధికారిని నియమించారు కిమ్. ఆయుధాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనీ ఆదేశించినట్టూ స్థానిక మీడియా రిపోర్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. గత వారమే కిమ్ వెపన్ ఫ్యాక్టరీస్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న ఆయుధాలు సరిపోవని, వాటి ప్రొడక్షన్ ఇంకా పెంచాలని తేల్చి చెప్పారు. మిజైల్ ఇంజిన్స్‌తో పాటు మరి కొన్ని ఆయుధాలనూ తయారు చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ పరిణామాలతో అటు అమెరికా ఉలిక్కి పడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నార్త్ కొరియా పాత్ర కూడా ఉందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకి నార్త్ కొరియా ఆయుధాలు సప్లై చేస్తోందని అంటోంది అగ్రరాజ్యం. రాకెట్స్, మిజైల్స్ సహా పలు ఆయుధాలు పంపుతోందని ఆరోపిస్తోంది. అయితే రష్యాతో పాటు నార్త్ కొరియా ఈ ఆరోపణల్ని ఖండించాయి.
అటు కిమ్ మాత్రం మిలిటరీ డ్రిల్స్ చేయాలని ఆదేశాలిచ్చేశారు. కొత్త ఆయుధాలతో ఈ డ్రిల్స్ చేయాలని మిలిటరీకి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 9వ తేదీన భారీగా మిలిటరీ పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అటు అమెరికా, సౌత్ కొరియా కూడా మిలిటరీ డ్రిల్స్‌కి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 21-24 వరకూ ఈ రెండు దేశాలూ కలిసి డ్రిల్స్ చేపట్టనున్నాయి.