Iran War Updates | ఇరాన్‌పై జూన్ 13, 2025 తెల్లవారుజామున జరిగిన 'ఆపరేషన్ లయన్ రైజింగ్' పేరుతో ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడి చాలా వ్యూహాత్మకంగా జరిగిందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. చాలా రోజుల నుండి పక్కా ప్రణాళికతో చేసిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 'ఆపరేషన్ లయన్ రైజింగ్' ముఖ్య లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమాన్ని, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నాశనం చేయడం. సరిగ్గా తన లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ఛేదించి చూపించింది. కానీ, ఇరాన్ మాత్రం ఈ దాడిని ఎందుకు అడ్డుకోలేకపోయిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ చాలా చాకచక్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం అందుతోంది.

200 అధునాతన విమానాలతో వంద లక్ష్యాలపై బాంబులు

'ఆపరేషన్ లయన్ రైజింగ్' పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడిలో 200కు పైగా యుద్ధ విమానాలు వినియోగించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగ్. జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. ఈ అధునాతన యుద్ధ విమానాలు F-35, F-15, F-16 లతో దాడులు చేసినట్లు చర్చ సాగుతోంది. ఈ మూడు విమానాలు అమెరికాలో తయారైనవే. వీటిని ఇజ్రాయెల్ కొనుగోలు చేసి తన వైమానిక దళంలో వినియోగిస్తోంది. ఈ విమానాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, అణు స్థావరాలు, కీలక నేతల కార్యాలయాలు.. ఇలా వంద లక్ష్యాలపై 330 బాంబులు, క్షిపణులను వాడి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఇరాన్ తమపై దాడికి దిగకుండా ముందస్తు రక్షణ చర్యలుగా ఈ దాడిని ఇజ్రాయెల్ సమర్థిస్తోంది.

ఇరాన్ ఎందుకు పసిగట్టలేకపోయిందంటే...?

ఇజ్రాయెల్ ఇంత పెద్ద దాడికి దిగుతుంటే ఇరాన్ ఏం చేయలేకపోయిందన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇరాన్ ఈ దాడిని పసిగట్టలేకపోవడానికి కారణం ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడివల్లే అని సైనిక నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున, ఊహించని రీతిలో ఆకస్మికంగా దాడి చేయడం వల్ల ఇరాన్‌కు వెంటనే దాన్ని ప్రతిఘటించేందుకు సమయం లేకపోయిందన్న వాదన వినిపిస్తోంది.

కీలకపాత్ర పోషించిన గూఢచార సంస్థ మొస్సాద్

ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థ కోవర్ట్ ఆపరేషన్ కీలకముగా పనిచేసిందని చెబుతున్నారు. ఇరాన్‌లోని టెహ్రాన్ సమీపంలో దాడికి ముందు డ్రోన్లను దాచి ఉంచారు. ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్‌పై దాడికి దిగే సమయంలోనే ఇరాన్ ప్రతిఘటించకుండా ఈ పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్లతో క్షిపణి లాంచర్లను పేల్చివేశారు. ఇందుకు అవసరమైన యుద్ధ సామాగ్రిని అక్రమంగా ఇరాన్‌లోకి రవాణా చేసి, వాటిని ఇరాన్‌లోని సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థల వద్ద దాచి ఉంచింది. ఇజ్రాయెల్ దాడి కాగానే ఈ వ్యవస్థలను తన ఆయుధాలతో నిర్వీర్యం చేసి, ఇరాన్ ప్రతిఘటించకుండా వ్యూహం పన్నింది. ఇందులో ఇరాన్ చిక్కుకుని ఏం చేయలేని పరిస్థితిని ఎదుర్కొంది.

వాహనాలపై స్ట్రైక్ సిస్టమ్స్ మొహరింపు

ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసిందనడానికి ఇదో ఉదాహరణ. ఇరాన్ రక్షణ వ్యవస్థలు మొహరించిన చోట వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి వాహనాలపై స్ట్రైక్ సిస్టమ్స్‌ను రహస్యంగా ఆ దేశంలోకి తరలించారు. చిన్న చిన్న వాహనాల్లో ఇరాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై దాడులు చేయడానికి తేలికపాటి గన్స్, రాకెట్ లాంచర్లు వంటి వాటిని యాక్టివేట్ చేశారు. ఇలా వైమానిక దాడులతో పాటు, భూతలం నుండి దాడికి దిగడం వల్ల ఇరాన్ సైన్యం గందరగోళంలో పడుతుంది. ముందుగా భూతల దాడులు ఎదుర్కోవాలా లేక, గగనతల దాడులు ఎదుర్కోవాలా అన్న గందరగోళంలో సైన్యం ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ వ్యూహం. సరిగ్గా ఇదే జరిగింది. వాహనాలపై స్ట్రైక్ సిస్టమ్స్ యాక్టివేట్ చేయడం ద్వారా ఇరాన్ సైన్యం భూతల దాడులపై దృష్టి పెట్టింది. ఈలోగా ఇజ్రాయెల్ విమానాలు స్వేచ్ఛగా గగనతలం నుండి ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, అణు కేంద్రాలపై దాడులు చేయగలిగింది.

ఇరాన్ కమాండ్ కంట్రోల్ నోడ్‌లను స్తంభింపజేసిన ఇజ్రాయెల్

యుద్ధం అంటే గన్లతో కాల్చుకోవడం, మిస్సైల్స్ ప్రయోగాలు కాదు. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని కూడా శత్రువును జయించవచ్చు. ఇజ్రాయెల్ మిలిటరీ సైబర్ యూనిట్ అదే పని చేసింది. కమాండ్ కంట్రోల్ నోడ్ అంటే యుద్ధ వ్యూహాలను రూపొందించి, అమలు చేసే కేంద్రం. పదాతి, వైమానిక, నౌకా దళాలను సమన్వయపరుస్తూ నిర్ణయాలు తీసుకునే కేంద్రం. యుద్ధ క్షేత్రం నుండి ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాన్ని విశ్లేషించి తదనుగుణంగా సత్వర నిర్ణయాలు తీసుకునే కేంద్రం. సైన్యానికి చెందిన అన్ని యూనిట్లకు ఇది కమ్యూనికేషన్ హబ్. ఇలాంటి కేంద్రం ధ్వంసం అయితే యుద్ధ ప్రణాళికలు గందరగోళంలో పడతాయి. సరిగ్గా ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగంలో యూనిట్ 8200 పేరుతో సైబర్ యూనిట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి ఇరాన్‌పై సైబర్ దాడులు జరిపి కమాండ్ కంట్రోల్ నోడ్‌లను స్తంభింపజేయగలిగాయి. దీంతో ఇజ్రాయెల్ దాడులకు ఎలా స్పందించాలి, ఎలా సమాచారం అందించాలి అన్న విషయంలో సమన్వయం లేని పరిస్థితి ఇరాన్‌ది.

ఇరాన్ రక్షణ వ్యవస్థలను అధిగమించిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు

ఇజ్రాయెల్ F-35, F-15, F-16 వంటి అమెరికా తయారీ అధునాతన యుద్ధ విమానాలు ఇరాన్ యొక్క రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టించి, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాలను నాశనం చేశాయి. ఇందులో ఒక్కో యుద్ధ విమానానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. F-35 యుద్ధ విమానాలు అత్యంత అధునాతమైన వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను ట్రాక్ చేసి, వాటిని నిర్వీర్యం చేసి ఉండవచ్చని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇక F-15, F-16 విమానాలతో భారీ బాంబులను అణు కేంద్రాలపై వేసి ఉండవచ్చని చెబుతున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు అన్ని విభాగాల సమన్వయంతో చేసిన మెరుపు దాడులుగా చెప్పవచ్చు.