Iran vs Israel: ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య పోరు తీవ్రం అవుతోంది. తాజాగా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు మృతి చెందారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో బాంబు పేల్చారు. దీనిపై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. 

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌ నిద్రపట్టడం లేదు. మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారుల్లో కీలక వ్యక్తులు ప్రాణాలు పోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ జనరల్ హసన్ మొహాకిక్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.  

మరో బాంబు పేల్చిన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అణు కార్యక్రమానికి ముప్పుగా గుర్తించి హత్య చేయడానికి పని చేసిందని ఆరోపించారు. "వారు ఆయనను చంపాలనుకుంటున్నారు. ఆయన నంబర్ వన్ శత్రువు" అని అన్నారు అని ఫాక్స్ న్యూస్ చెప్పుకొచ్చింది.  

తాను కూడా ఇప్పుడు హిట్‌ లిస్ట్‌లో ఉన్నానని అని నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో అన్నారు. తన దేశం అణు విధ్వంసం ముప్పును ఎదుర్కొంటుందని అందుకే దూకుడుగా వ్యవహరించడం తప్ప వేరే మార్గం లేదని నెతన్యాహు అన్నారు. "మేము ముప్పును ఎదుర్కొంటున్నాము" అని ఆయన అన్నారు. దాడులతో ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోందన్నారు. 

ఇజ్రాయెల్ దాడి ఇరాన్ అణు కార్యకలాపాలను కొంతవరకు వెనక్కి తగ్గేలా చేశాయని నమ్ముతున్నట్టు నెతన్యాహు అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాలకులతో చర్చలు ఎక్కడా జరగడం లేదని చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రపంచానికి విసురుతున్న అణు,  బాలిస్టిక్ క్షిపణి సవాల్‌ను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉందని అన్నారు.

ఆపరేషన్ రైజింగ్ లయన్‌గా పిలుచుకునే ఆపరేషన్‌ను "చరిత్రలో గొప్ప సైనిక కార్యకలాపాలలో ఒకటి"గా నెతన్యాహు అభివర్ణించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని చాలా కాలంగా బెదిరించిన అదే ఇస్లామిక్ పాలన ద్వారా వారు 50 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారని ఆయన అన్నారు.

శాంతి నెలకొంటుంది: ట్రంప్‌

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని, అది జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. భారత్‌, పాకిస్తాన్‌తో చేసినట్లుగానే ఇక్కడ కూడా పరిస్థితులు చక్కదిద్దుతాని తెలిపారు. దీని కోసం అమెరికా వాణిజ్య అంశాన్ని తెరపైకి తీసుకురావచ్చని తెలుస్తోంది. వేర్వేరు దేశాల్లో ఉన్న పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. సెర్బియా, కొసావో అనేక దశాబ్దాలుగా కొట్టుకుంటున్నాయని ఇది కూడా యుద్ధంగా మారడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఆపాను అన్నారు. బైడెన్ మూర్ఖపు నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బతీశారని, కానీ నేను దానిని మళ్ళీ పరిష్కరిస్తానని ఆయన అన్నారు. నైలు నదిని ప్రభావితం చేస్తున్న భారీ ఆనకట్టపై ఈజిప్ట్,  ఇథియోపియా మధ్య పోరాటం కూడా తన జోక్యంతో ఆగిపోయిందని అన్నారు. అలానే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య త్వరలో శాంతి నెలకొంటుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చాలా చేస్తాన్నట్టు చెప్పుకొచ్చారు. అయినా సరే దేనికీ క్రెడిట్ తీసుకోను అంటూ తెలిపారు.