Israel Started Operation Lebanon : మంగళవారం (సెప్టెంబర్‌ 17) నాడు పేజర్ల పేలుళ్లతో మొదలైన కల్లోలం.. తర్వాత రోజు రేడియోలు, వాకీటాకీలు సహా వాటి ఛార్జింగ్‌కు వినియోగించే సోలార్ ఉపకరణాల పేలుడుతో లెబనాన్ వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం చోటుచేసుకుంది. వరుస ఘటనలతో సతమతమైన  హెజ్‌బొల్లాకు కోలుకొనే సమయం కూడా ఇవ్వని ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ సంస్థ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టింది. శుక్రవార నాటి దాడుల్లో ఆ సంస్థ నెంబర్‌ 2 ఇబ్రపహీం అకీల్‌ను అంతం చేసింది. గురువారం నుంచి గగనతల దాడులతో హెజ్‌బొల్లాకు చెందిన రాకెట్‌ లాంచర్లను పేల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా నుంచి క్రమంగా లెబనాన్‌ సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తోంది.


హెజ్‌బొల్లాలో నెంబర్‌ టూగా ఉన్న ఇబ్రహం అకీల్ మరణం:


మంగళవారం, బుధవారం పేజర్ల పేలుళ్లు, వాకీటాకీల విధ్వంసంతో లెబనాన్ వ్యాప్తంగా ఇరాన్ మద్దతుతో నడిచే హెజ్‌బొల్లాకు మృత్యుసందేశాలు పంపిన ఇజ్రాయెల్.. దానికి ఊపిరి సలపనివ్వకుండా గురువారం నుంచి వైమానిక దాడులకు దిగింది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడగా.. ఆ రాకెట్ లాంచర్లే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయెల్ హెజ్బొల్లాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. గురువారం (సెప్టెంబర్‌ 19)న దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన వంద రాకెట్ లాంచర్లపై దాడి చేసి వెయ్యి బారెల్స్ వరకూ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. శుక్రవారం నాడు లెబనాన్ రాజధాని బైరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన వరుస దాడుల్లో హెజ్‌బొల్లాకు పెను నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఆ సంస్థకు నెంబర్‌ 2గా ఉంటున్న ఇబ్రహీం అకిల్‌ ఆ దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. అతడితో పాటు మరి కొంత మంది కమాండర్లు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొత్తం 10 మంది కమాండర్లు సహా అకీల్ మరణించినట్లు చెప్పింది. అయితే ఈ వార్తను హెజ్‌బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు. ఈ అకీల్ గతంలో హెజ్‌బొల్లా రద్వాన్ దళానికి నేతృత్వం వహించాడు. ఆ సంస్థ అత్యున్నత స్థాయి కమిటీ అయిన జిహాద్‌ కౌన్సిల్‌ను కూడా నడిపించాడు. ప్రస్తుత హెజ్బొల్లా చీఫ్‌ నస్రుల్లాకి వారసుడిగా చెపుతుండగా.. అతడిపై 1980 నుంచే ఆంక్షలు ఉన్నాయి. 1983లో బైరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో అకీల్ కమాండర్‌గా వ్యవహరించాడు. అప్పట్లో అతడి తలపై అమెరికా 7 మిలియన్ డాలర్ల ప్రైజ్‌ మనీ కూడా పెట్టింది. ఇప్పుడు అకీల్‌ను హతమార్చిన దహియా ప్రాంతంలోనే హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ ఝుక్ర్‌ను కూడా జులైలో ఇజ్రాయెల్ సైన్యం మట్టుపెట్టింది.


గాజా నుంచి లెబనాన్‌వైపు దృష్టి మరల్చిన ఇజ్రాయెల్ :


తమ అస్తిత్వమే లక్ష్యంగా.. మధ్యప్రాశ్చ్యంలో హమాస్‌పై దాడులు జరుపుతూ కొన్నేళ్లుగా గాజాలో నెత్తుటేర్లు పారిస్తూ వస్తున్న  ఇజ్రాయెల్.. ఇప్పుడు దృష్టిని లెబనాన్‌ వైపు మళ్లించింది. ఆపరేషన్ లెబనాన్ మొదలు పెట్టినట్లు.. పేజర్లు పేలిన రోజునే అమెరికాకు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గలాంట్‌.. యూఎస్‌ విదేశీ వ్యవహారాల సెక్రటరీ ఆస్టిన్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గాజాలో యుద్ధం ముగింపు దశకు చేరుకున్న వేళ.. కీలక యూనిట్లను లెబనాన్ వైపు తరలిస్తోంది. భారీస్థాయిలో ట్యాంకర్లు, క్షిపణనులను మొహరిస్తోంది. ఏ క్షణమైనా లెబనాన్‌పై ముప్పేట దాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ తన అస్తిత్వం కోసం సాగించే పోరాటంలో తమ మద్దతు ఆ దేశానికి ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అటు.. గాజాలో కొందరు ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్ల శవాలను బహుళ అంతస్తుల భవనంపై నుంచి కాళ్లతో తోయడం కలకలం రేపగా.. ఇజ్రాయెల్ రక్షణ శాఖ అంతర్గత విచారణకు ఆదేశించింది.


Also Read: పాకిస్తాన్‌ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు