Israel Military: ఈ మధ్యకాలంలో ఏఐ (Artificial Intelligence) అనే పదం ప్రతి చోటా వినిపిస్తోంది. కృత్రిమ మేధ చేస్తున్న అద్భుతాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ప్రతి రంగంలోనూ అడుగుపెట్టిన ఏఐని.. తమ మిలిటరీలో ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 నాటికి దాదాపు సగం మంది ఇజ్రాయెల్ సైనిక సాంకేతిక నిపుణులు ఏఐపై దృష్టి సారిస్తారని మిలిటరీ డేటా, అప్లికేషన్స్ విభాగాధిపతి కల్నల్ ఎలి బిరెన్‌బామ్ తెలిపారు. ప్రస్తుతం వందలాది మంది సిబ్బంది ఏఐ సంబంధిత ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది సైనిక సాంకేతిక నిపుణులు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో వారి సంఖ్య వేలకు చేరుకుంటుందని బీరెన్‌బామ్ అంచనా వేశారు. 


ఇటీవల గాజాలో జరిగిన దాడుల సమయంలో ఇజ్రాయెల్ కమాండర్లు 'నాలెడ్జ్ వెల్' అనే కొత్త టూల్ ను వాడారు. ఇది పాలస్తీనా రాకెట్ ప్రయోగాల గురించి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ను అందించింది. ఈ ప్లాట్‌ఫార్మ్ వాట్సాప్ మాదిరిగానే రాకెట్ ప్రయోగాల ప్రదేశాల సమాచారాన్ని వాటి ఫ్రీక్వెన్సీ, రేంజ్ తదితర వివరాలను అప్పటికప్పుడు అందించింది. అయితే అంతటి డేటాను విశ్లేషించి ఒక అంచనాకు వచ్చి దానికి ప్రతి దాడి ప్లాన్ చేయడం మానవులకు అంత తక్కువ సమయంలో సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడే ఏఐని వాడుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు రక్షణ బడ్జెట్ ను పెంచినట్లు సమాచారం. దాంతో పాటు ఇజ్రాయెల్‌ను ప్రముఖ ఏఐ పవర్‌హాజ్‌గా నిలపాలన్న లక్ష్యాన్ని కూడా నెతన్యాహు వెలిబుచ్చారు. అయితే ఏఐకి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే సిబ్బందిని సృష్టించుకోవడం ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందున్న అతిపెద్ద సవాల్ అని నిపుణులు పేర్కొంటున్నారు. సిబ్బందికి ఏఐపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. 


తప్పనిసరిగా మిలిటరీలో పని చేయాల్సిందే


ఇజ్రాయెల్ యువత తమ చదువు పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా మిలిటరీలో పని చేయాల్సిందే. మహిళలు రెండు సంవత్సరాలు, పురుషులు అయితే 32 నెలల పాటు ఆర్మీలో పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వారికి నెలకు $335 జీతంగా అందిస్తారు. తప్పనిసరి సర్వీస్ పూర్తి అయిన తర్వాత $2,300 జీతంగా ఇస్తారు. ఈ మొత్తం చాలా చాలా తక్కువ అన్న అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణ ప్రజలు అదే పనిని మిలిటరీ బయట చేసుకుంటే $8,400 వరకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


జీతం తక్కువ రావడంపై కల్నల్ బీరెన్‌బామ్ స్పందిస్తూ.. గూగుల్, ఫేస్‌బుక్‌ లాంటి కార్పొరేట్ సంస్థలతో పోటీ పడి జీతాలు ఇవ్వలేమని అన్నారు. అయితే మిలిటరీలోకి వచ్చి చేసే పని అర్థవంతంగా ఉంటుందని, తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం చేసే బాధ్యతగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వాడకంపై ఆందోళనలు రేకెత్తుతున్న విషయంపై స్పందించిన బీరెన్ బామ్.. ఇజ్రాయెల్ లో ఏఐ వాడకాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. ఇది విధ్వంసానికి దారి తీయదని హామీ ఇచ్చారు. ఏఐ టూల్స్ వాడినా.. మనుషులదే తుది నిర్ణయంగా ఉంటుందని నొక్కి చెప్పారు.