అక్టోబర్ 7న దాడులు..
Israel Palestine Attack: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు (Israel Hamas War) మొదలు పెట్టారు. ముందుగా ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌పై కాల్పులు జరిపారు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ సమయంలో అక్కడ పార్టీ మూడ్‌లో ఉన్న వాళ్లంతా అటూ ఇటూ పరుగులు పెట్టారు. హమాస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా వాళ్లపై కాల్పులు జరిపారు. అక్కడ ఒక్క చోటే దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరిని కిడ్నాప్ చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. అయితే..ఆ సమయంలో ఈ దాడుల నుంచి తప్పించుకుని ఎలాగో ప్రాణాలతో బయట పడ్డ వాళ్లు ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి తేరుకోలేదు. ఆ ముప్పు నుంచి ఎలా తప్పించుకున్నారో వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్‌కి చెందిన ఓ మోడల్ హమాస్ ఉగ్రవాదుల కంటబడకుండా ఎలా బయటపడిందో చెప్పింది. 27 ఏళ్ల మోడల్ నోవమ్ మజల్ బెన్ డేవిడ్ (Noam Mazal Ben-David)ని కాలిపై కాల్చారు ఉగ్రవాదులు. వెంటనే కింద పడిపోయింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఈ ఫెస్ట్‌కి వెళ్లింది నోవమ్. అప్పటికే బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపారు. కళ్ల ముందు మృతదేహాలు కుప్పలా పడి ఉన్నాయి. ఆ సమయంలోనే నోవమ్‌పైనా దాడి చేశారు ఉగ్రవాదులు. ప్రాణాలు కాపాడుకునేందుకు తన బాయ్‌ఫ్రెండ్ మృతదేహం కిందే దాక్కుంది. ఆ రక్తపు మడుగులోనే ఉగ్రవాదులకు కనిపించకుండా దాక్కుంది. అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకూ కిక్కురుమనకుండా ఉండిపోయింది. అక్టోబర్ 7న ఉదయం 7 గంటల సమయంలో Supernova Festivalపై ఈ దాడులు జరిగాయి.
"ఉన్నట్టుండి ఉగ్రవాదులు లోపలికి వచ్చి కాల్పులు జరిపారు. ఇష్టమొచ్చినట్టు కాల్చేశారు. చాలా మంది చనిపోయారు. ఎలాగోలా వాళ్ల కంటబడకుండా దాక్కున్నాను. అక్కడి నుంచి బయటపడే మార్గం దొరకలేదు. అప్పుడే ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చి పారిపోవాలంటూ గట్టిగా అరిచాడు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే నా బాయ్‌ఫ్రెండ్ చనిపోయాడు. తన ఛాతిపై కాల్చి చంపారు. నా కాలికి ఓ బులెట్ తగిలింది. గాయమై రక్తం కారుతున్నా నోరు మూసుకుని ఉండిపోయాను. ఏ మాత్రం చప్పుడు చేసినా వచ్చి చంపేస్తారని భయం వేసింది. చాలా సేపు అక్కడి డెడ్‌బాడీస్ పక్కనే దాక్కుండిపోయాను"
- నోవమ్ మజల్ బెన్ డేవిడ్, ఇజ్రాయేల్ మోడల్
గాజాపై నెల రోజులుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇప్పటి దాకా జరిగిన ఘర్షణలో 9,700 మంది పాలస్తీనీయులు మరణించారు. కాల్పుల విరమణకు పలు దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయెల్ భేఖాతరు చేస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. వివిధ దేశాల సూచనలను పట్టించుకోకుండా గాజాపై భీకర దాడులను కొనసాగిస్తూనే ఉంది. గాజాలో కాల్పులు విరమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గాజాలో ప్రజలకు సాయం అందించేందుకు వీలుగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్న నేపథ్యంలో నెతన్యాహు తమ వైఖరిని వెల్లడించారు. సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. తమ దేశంలోని దక్షిణ ప్రాంతంలో రెండు కార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని, ముగ్గురు పిల్లలు, ఒక మహిళ మరణించారని లెబనాన్ వెల్లడించింది. మరోవైపు హెజ్‌బొల్లా దాడిలో ఓ ఇజ్రాయెలీ మృతి చెందారు.
Also Read: గాజాని రెండు ముక్కలు చేశాం, ఇప్పట్లో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు - ఇజ్రాయేల్ కీలక ప్రకటన