Israel Hamas Attack:
శరణార్థుల క్యాంప్‌పై దాడి..
Gaza News: గాజాపై ఇజ్రాయేల్ దాడులు (Israel Hamas War) కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓ సారి శరణార్థుల క్యాంప్‌పై దాడి చేసిన ఇజ్రాయేల్..ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థుల క్యాంప్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి భయపడి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని శిబిరాల్లో తలదాచుంటున్నారు పాలస్తీనా పౌరులు. అక్కడ కూడా వాళ్లకు భద్రత లేకుండా పోయింది. వరుస దాడుల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలొదులుతున్నారు. వేలాది మంది ఇంకా భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు. Guardian వెల్లడించిన వివరాల ప్రకారం...ఖాన్ యౌనిస్ సమీపంలో గగనతలం నుంచి దాడులు చేసింది ఇజ్రాయేల్ సైన్యం (Israel Defence Forces). ఆ దాడిలో 26 మంది బలి అయ్యారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్‌పై దాడులు జరిగాయి. ఈ బిల్డింగ్‌లోని 52 మంది మృతి చెందారు. మరో బిల్డింగ్‌పై దాడి జరగ్గా అందులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 19 మంది చిన్నారులన్నారు. పాలస్తీనా పౌరులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన శిబిరాలపైనా దాడులు చేయడాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. పిల్లల భవిష్యత్ కోసం కట్టిన స్కూళ్లనూ ఇలా కూల్చేయడంపై మండి పడింది. ఈ యుద్ధంలో సామాన్యులు ఎందుకు నలిగిపోవాలంటూ ప్రశ్నించింది.
హాస్పిటల్‌ని ఖాళీ చేయించిన ఇజ్రాయేల్..
గాజాలోని Al Shifa Hospitalపై దాడులు చేయడం వల్ల బిల్డింగ్‌లు ధ్వంసమయ్యాయి. కరెంట్ సప్లై కట్ అయింది. ఫలితంగా ఇన్‌క్యుబేటర్‌పైన ఉంచాల్సిన చిన్నారులకు వైద్యం అందక చనిపోయారు. ఈ దాడుల తరవాత ఇజ్రాయేల్ సైన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే దాడులను నిలిపివేసి హాస్పిటల్‌లో ఉన్న రోగులను వేరే చోటకు తరలించారు. అయితే 120 మంది రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉండడం వల్ల అక్కడే ఉంచి వైద్యం అందిస్తున్నారు. వాళ్లను చూసుకునేందుకు 5గురు వైద్యులను ఉంచారు. వాళ్లకు అవసరమైన మందులను అందుబాటులోకి ఉంచారు.