Israel Gaza War:


బందీల విడుదల..


ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఇటీవలే (Israel-Hamas War) ఓ ఒప్పందం కుదిరింది. నాలుగు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేయడంతో పాటు బందీలను విడుదల చేసేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే విడతల వారీగా బందీలను అప్పగించారు. ఇటు ఇజ్రాయేల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసులకు విముక్తి కలిగించింది. అయితే...ఈ డీల్‌ని మరో రోజు పాటు పొడిగించే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా...పొడిగించడంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Israel Defence Forces) ఈ మేరకు సంకేతాలిచ్చింది. "operational pause"ని మరో రోజు పాటు పొడిగించే యోచనలో ఉన్నట్టు తెలిపింది. అయితే...కేవలం ఒక్క రోజేనా..? మరి కొన్ని రోజులు ఎక్స్‌టెండ్ చేస్తారా అన్నదీ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఇది చర్చల దశలో ఉందని వెల్లడించింది. కొన్ని షరతులు విధించి మరికొంత మంది బందీలను విడుదల చేయించాలని ఇజ్రాయేల్‌ భావిస్తోంది. అటు హమాస్ కూడా స్పందించింది. ఆపరేషన్ పాజ్‌ని పొడిగించాలని చూస్తున్నట్టు తెలిపింది. ఖతార్ మాత్రం మరో రోజు పాటు దీన్ని పొడిగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. భారీగా నష్టపోయిన గాజాకి సాయం అందించేందుకూ ఇరు వర్గాలు అంగీకరించాలన్న ఒత్తిడి అంతర్జాతీయంగా పెరుగుతోంది. 




వెనక్కి తగ్గం..


యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోని బ్లింకెన్ ఇప్పటికే ఇజ్రాయేల్ పర్యటనకు సిద్ధమయ్యారు. మరోసారి నెతన్యాహుతో చర్చించే అవకాశాలున్నాయి. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టింది. నాలుగు రోజుల పాటు యుద్ధం ఆపేయాలన్న ఒప్పందం ముగిసే ఓ గంట ముందు పొడిగించేందుకు చర్చలు మొదలయ్యాయి. ఒక్కసారి ఈ డీల్‌ ముగిసిపోగానే మళ్లీ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయేల్ కూడా చెబుతోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి మళ్లీ గాజాపై దాడులు మొదలు పెట్టాలని సైన్యానికి ప్రభుత్వం ఆదేశించింది.