ఎలన్ మస్క్‌పై ఫైర్..
యూఎస్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk Israel Visit) ఇటీవలే ఇజ్రాయేల్‌లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని కలిశారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల్ని ఖండించారు. ఇజ్రాయేల్‌కి మద్దతు (Israel-Hamas War) ప్రకటించారు. ఇటీవల జూదులకు వ్యతిరేకంగా ట్విటర్‌లో (ప్రస్తుతం ఎక్స్) ఓ పోస్ట్ వైరల్ అయింది. వెంటనే దాన్ని తొలగించింది ట్విటర్. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ని అడ్డుకోవడంలో తమ కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని ఎలన్ మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. అయితే...మస్క్ ఇజ్రాయేల్‌లో పర్యటించడంపై హమాస్ అసహనం వ్యక్తం చేసింది. ఓ సారి గాజాలోనూ పర్యటించాలని, ఇజ్రాయేల్ యుద్ధం పేరుతో ఎంత విధ్వంసానికి పాల్పడిందో చూడాలని అన్నారు హమాస్ అధికారి ఒసామా హమ్‌దన్.
"ఎలన్ మస్క్ ఓ సారి గాజా వచ్చి ఇక్కడి పరిస్థితులు చూడాలి. ఇజ్రాయేల్ ఎంత విధ్వంసం సృష్టించిందో అర్థమవుతుంది. గాజా పౌరులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. 50 రోజుల్లో ఇజ్రాయేల్ గాజాపై 40 వేల టన్నుల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఓ సారి ఇజ్రాయేల్‌తో ఉన్న తమ మైత్రిని రివ్యూ చేసుకోవాలి. ఆయుధాల సరఫరా నిలిపివేయాలి"
- ఒసామా హమ్‌దన్, హమాస్ అధికారి
వేలాది మంది శిథిలాల కిందే..
అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు చేశారు. అప్పటి నుంచి యుద్ధం (Israel Palestine War) కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. నాలుగు రోజుల పాటు యుద్ధాన్ని ఆపేసి బందీలను అప్పగిస్తోంది హమాస్. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్‌పై హమ్‌దన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అంతే కాదు. అంతర్జాతీయ సమాజమూ జోక్యం చేసుకుని... స్పెషలైజ్డ్ సివిల్ డిఫెన్స్ టీమ్స్‌ని పంపాలని కోరారు. శిథిలాల కింద చాలా మంది నలిగిపోయారని, వాళ్ల మృతదేహాల్ని వెలికి తీసేందుకు సహకరించాలన్నారు. పాలస్తీనా విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ యుద్ధంలో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు బలి అయ్యారు. 16 వేల మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది వలస వెళ్లారు.
గాజాలో బాధితులకు సాయం అందించడానికి ఈజిప్ట్‌లోని రఫా సరిహద్దు సామగ్రి వెళ్తోందని అయితే ఇది ఏమాత్రం సరిపోదని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కెరెమ్ షాలోమ్ సరిహద్దు మీదుగా రిలీఫ్ ట్రక్కులు పంపించాలని UN కోరుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మధ్య పోరులో పొడిగించిన సంధిని వైట్ హౌస్ స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ ప్రక్రియలో మరింత లోతుగా ఆలోచిస్తున్నారని నెతన్యాహుతో ఖతార్ ఎమిర్ చెప్పారు. గురువారం ఉదయం వరకు గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపివేయడంపై వైట్ హౌస్ స్వాగతించిందని, ఈ విషయాన్ని ఖతార్ ప్రకటించడం అభినందనీయమన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply