Israel Gaza Attack: 


ఇజ్రాయేల్‌కి బైడెన్ సూచనలు..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయేల్‌కి కీలక సూచనలు చేశారు. అనవసరంగా ఆవేశపడొద్దని హెచ్చరించారు. ఈ సమయంలోనే 9/11 దాడులను ప్రస్తావించారు. ఆ సమయంలో అమెరికా కూడా చాలా ఆగ్రహానికి లోనైందని, ఆ క్రమంలో కొన్ని తప్పులు చేసిందని అన్నారు. ఇజ్రాయేల్‌, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇప్పటికే టెల్‌ అవీవ్‌లో పర్యటించారు బైడెన్. ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయుధ సహకారమూ అందిస్తున్నారు. అయితే...ఆవేశంతో సాధించేదేమీ లేదని హితవు పలకడమే ఆసక్తికరంగా మారింది. 


"ఇజ్రాయేల్‌కి వెళ్లి నెతన్యాహుతో భేటీ అయినప్పుడు మా మధ్య కీలక చర్చలు జరిగాయి. 9/11 దాడుల సమయంలో అమెరికా ఎంత ఆవేదనకు గురైందో చెప్పాను. మేమూ అప్పుడు ఆవేశంతో ఊగిపోయాం. ఆ దాడులకు బదులు తీర్చుకోవాలని చూశాం. ఆ క్రమంలో మేమూ నష్టపోయాం. కొన్ని తప్పులు చేశాం. అందుకే ఇజ్రాయేల్‌కి నేనో సలహా ఇస్తున్నాను. ఆవేశంతో గుడ్డిగా ముందుకు వెళ్లొద్దు"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు


అమెరికా సాయం..


ఇజ్రాయేల్‌ నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయేల్‌కి బిలియన్ డాలర్ల కొద్ది సాయం చేసేందుకు అమెరికన్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనకాడినా అమెరికా విలువలకే మచ్చ వస్తుందని తేల్చి చెప్పారు. గాజాపై దాడులను ఉద్ధృతం చేయాలని ఇజ్రాయేల్‌ సిద్ధమవుతున్న సమయంలోనే బైడెన్ మరింత సాయం అందించేందుకు చొరవ చూపించారు. దాదాపు 8 గంటల పాటు ఇజ్రాయేల్‌లో పర్యటించారు జో బైడెన్. నెతన్యాహు బైడెన్‌కి థాంక్స్ చెప్పారు. ఇజ్రాయేల్‌కి మద్దతుగా ఉంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గత వారమే యూఎస్ స్టేట్ సెక్రటరీ యాంటోని బ్లింకెన్ టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఇలా వరుస పర్యటనలతో అమెరికా సపోర్ట్ ఇస్తూ వస్తోంది. 


"గాజా హాస్పిటల్‌పై జరిగిన దాడి ఎంతో ఆవేదనకు గురి చేసింది. నాకు తెలిసినంత వరకూ ఇది కచ్చితంగా ఇజ్రాయేల్ పనైతే కాదు. వేరేవరో చేసిన పని ఇది. ఈ దాడి మీరు చేయలేదు(ఇజ్రాయేల్‌ని ఉద్దేశిస్తూ).  కానీ అంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇప్పటి వరకూ హమాస్ ఉగ్రవాదులు 1300 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అందులో 31 మంది అమెరికన్లూ ఉన్నారు. పిల్లలతో సహా చాలా మందిని బందీలుగా చేసుకున్నారు. ఐసిస్‌ కన్నా క్రూరంగా ప్రవర్తించారు


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు


బైడెన్ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి స్నేహితుడు తమ వైపు ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తమకు మద్దతుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 


"మీలాంటి మంచి మిత్రుడు అండగా ఉండడం ఇజ్రాయేల్ ప్రజలకు ఆనందంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకి వచ్చి మరీ మద్దతునిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మమ్మల్ని ఎంతో కదిలించింది. ఇజ్రాయేల్‌కి మీరు ప్రతి సందర్భంలోనూ మద్దతుగా ఉంటున్నందుకు థాంక్యూ"


- బెంజిమన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని


Also Read: Canada Diplomats: 41 మంది దౌత్యవేత్తలను ఉపసహరించుకున్న కెనడా - భారత్‌పై మరోసారి అక్కసు