Iran Israel Conflict Latest News: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని అమెరికా ఎట్టకేలకు యుద్ధరంగంలోకి దిగింది. అమెరికా సైనిక జోక్యం చేసుకోవద్దని ఇరాన్ మొదట్నుంచీ చెబుతోంది. కానీ ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్ఫహాన్, నటాంజ్,  ఫోర్డో అణు స్థావరాలపై అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో దాడులు చేసింది. అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. 

ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. తమ అణస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ అణు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసేది లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని పెజెష్కియాన్ వెల్లడించినట్లు సమాచారం.

తమ అణుస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ సహా కనీసం 19 దేశాల్లో అమెరికా సైనిక ఉనికిని కలిగి ఉందని తెలిసిందే. ఇరాన్ లక్ష్యాలలో ఒకటి బహ్రెయిన్‌లోని మినా సల్మాన్‌లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం కావొచ్చు. ఇరాన్ సైన్యం దీనిపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

హోర్ముజ్ జలసంధి, చమురు సరఫరాకు ముప్పు

అమెరికా రంగంలోకి దిగనంత పరిస్థితి ఒకలా ఉండేది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగి, ఇరాన్ లోని అణు స్థావరాలపై దాడి చేయడంతో  ఇరాన్ ప్రపంచ సముద్ర మార్గాలను, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్‌ను హిందూ మహాసముద్రంతో కలిపే కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకోనుంది. ప్రపంచ చమురులో దాదాపు 30 శాతం ఈ జలసంధి ద్వారా వెళుతుంది. ఒకవేళ అక్కడి నుంచి చమురు సరఫరా నిలిచిపోయేలా దారులు మూసివేస్తూ ఆటంకం కలిగించేలా ఇరాన్ వ్యూహాత్మక చర్యలు చేపట్టనుంది. దాంతో ఇది పలు దేశాలకు  ఆర్థికపరమైన సమస్యగా మారనుంది. ఇక్కడ ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత్వానికి దారి తీస్తుంది. దాంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇతర సముద్ర మార్గాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 

అణు స్థావరాలను ఖాళీ చేసిన ఇరాన్

అమెరికా హెచ్చరికలు, ఇజ్రాయెల్ దాడులు పెంచుతున్న క్రమంలో ముప్పు పొంచి ఉందని భావించిన ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అమెరికా దాడులకు ముందు ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ సహా కీలక అణు కేంద్రాలను ఇరాన్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా డిప్యూటీ హెడ్ హసన్ అబెడిని అణు కేంద్రాలను ఖాళీ చేయడాన్ని ధృవీకరించారు.

"ఇరాన్ కొన్ని రోజుల కిందటే మూడు అణు స్థావరాలను ఖాళీ చేసింది. ఈ స్థావరాల నుండి యురేనియం నిల్వలను ఇతర ప్రాంతాలకు తరలించాం. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే రేడియేషన్ విడుదలై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించాం. ప్రస్తుతం ఆ అణు స్థావరాలలో ఎలాంటి హాని కలిగించే పదార్థాలు ఏవీ లేవు" అని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై బాంబులు వేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో అమెరికా దాడి చేసినట్లు సమాచారం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పలు దేశాలకు తలనొప్పిగా మారనుంది.