India Canada Tensions:



భారత్‌పై అసహనం..


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని మరోసారి కవ్వించారు. అంతే కాదు. చట్టప్రకారం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరిపానని, అటు అమెరికాతోనూ మాట్లాడానని చెప్పారు. సరైన విధంగా విచారణ చేపట్టేందుకు సహకరించాలని కోరినట్టు గుర్తు చేశారు. ఈ హత్యని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు ట్రూడో. అన్ని దర్యాప్తు సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతూ విచారణ చేపడుతున్నట్టు వివరించారు. 


"హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అన్ని దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. చట్ట ప్రకారమే మేం పోరాడుతున్నాం. కెనడా ఎప్పటికీ చట్టానికి అనుగుణంగానే నడుచుకుంటుంది. పెద్ద దేశాలన్నీ పరిణామాల గురించి పట్టించుకోకుండా అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తూ పోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుందిఠ


- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని 


తాము చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని, విచారణలో భారత్ ఏ విధంగానూ సహకరించడం లేదని మండి పడ్డారు. పైగా Vienna Convention ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తమ దౌత్యవేత్తల్ని భారత్ నుంచి వెనక్కి రప్పించాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు ట్రూడో. తమ దౌత్యవేత్తలు ఓ దేశంలో సురక్షితంగా లేరంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ మండి పడ్డారు. ఇప్పటికీ భారత్‌ పట్ల సానుకూలంగానే ఉన్నామని స్పష్టం చేశారు.






నవంబర్ 19వ తేదీన Air India విమానాల్లో ఎవరూ ప్రయాణించొద్దంటూ ఖలిస్థానీ మద్దతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ (Gurpatwant Singh Pannun) వార్నింగ్ ఇచ్చాడు. వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అవడమే కాకుండా సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే భారత్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు కెనడా ఈ వీడియోపై స్పందించింది. ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులను అంత తేలిగ్గా తీసుకోమని, ముఖ్యంగా ఎయిర్‌ లైన్స్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేసింది. కెనడా రవాణా మంత్రి పాబ్లో రోడ్రిగెజ్ ( Pablo Rodriguez) స్వయంగా ఈ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. కెనడా పోలీసులు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారని తెలిపారు. గత వారమే గురుపత్వంత్ సింగ్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. Sikhs for Justice సంస్థకి జనరల్ కౌన్సిల్‌గా ఉంటున్నాడు గురుపత్వంత్. "నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకండి. మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయ్" అని వార్నింగ్ ఇచ్చాడు.


Also Read: Gaza News: ఇజ్రాయేల్‌కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం, ఓటు వేసిన భారత్