ఇజ్రాయెల్ పై హమాస్ దాడి నేపథ్యంలో మిలిటెంట్ల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల అకృత్యాలు యావత్ ప్రపంచాన్నే దిగ్భాంతికి గురి చేస్తున్నాయి. మనుషులు, జంతువులు అనే తేడా లేకుండా విరుచుకు పడుతున్న మిలిటెంట్ల దారుణ ఘటనలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఈ నర మేధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.


తల్లి గర్భాన్ని చీల్చి


ఓ మహిళ గర్భంతో ఉండగా ఆమెను చంపిన మిలిటెంట్లు, గర్భాన్ని చీల్చి మరీ లోపల బిడ్డను చంపినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లోని అష్ దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ, 'జాకా' సంస్థలో వాలంటీర్ గా పని చేస్తున్నారు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవిస్తే ఈ సంస్థ అక్కడి మృతదేహాలను సేకరిస్తుంది. గత 33 ఏళ్లుగా ఇదే పని చేస్తున్న యోసి లాండౌ, తాజా యుద్ధంలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. శవాల దిబ్బలను చూసి తన గుండె బద్దలైనట్లు ఆయన చెప్పారు. 'వీధుల్లో ఎక్కడ చూసిన మృతదేహాలే. ఓ గర్భిణీ మృతదేహాన్ని చూసి నాకు, మా బృందానికి కన్నీళ్లు ఆగలేదు. తల్లి పొట్టను చీల్చి మరీ లోపలున్న బిడ్డను చంపారు. ఇంకా బొడ్డు తాడు కూడా తెగని ఆ బిడ్డను పొడిచి చంపారు.' అంటూ లాండౌ ఆ భయానక ఘటనను ఓ అంతర్జాతీయ మీడియాకు కన్నీటితో వివరించారు. 


హింసించి చంపేశారు


కొందరు పౌరుల చేతులను వెనక్కు కట్టి వారిని హింసించి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  కిబ్బట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇక్కడికి సమీపంలోనే సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ మారణ హోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


తల్లి శవం కింద దాక్కొని


బుల్లెట్ల గాయాలతో మరణించిన తన తల్లి మృతదేహం కిందే కదలకుండా ఉండిపోయిన ఓ కొడుకు ప్రాణాలతో బయటపడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని కిబ్బట్జ్ నగరంపై గత శనివారం ఉగ్రమూకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.  రోటెమ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కాల్చేందుకు మిలిటెంట్లు యత్నించగా అతని తండ్రి అడ్డుకున్నాడు. కానీ, వారు కాల్పులు జరపడంతో అతని చేయి ముక్కలైంది. వెంటనే అక్కడున్న రోటెమ్ తల్లి డెబ్బీ మథియాస్, 'కింద పడుకోవాలంటూ' రోటెమ్ కు సూచించారు. అప్పటికే బుల్లెట్ రోటెమ్ కడుపులోకి దూసుకెళ్లింది. రోటెమ్ తల్లి కూడా బుల్లెట్ల ధాటికి ప్రాణాలు కోల్పోగా, ఆమె మృతదేహం కింద రోటెమ్ ఉండిపోయాడు. ఇలా దాదాపు 30 నిమిషాలు ఉన్న అనంతరం ఇజ్రాయెల్ సైనికులు అతన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతన్న సమయంలో ఈ ఘటనను ఆయన మీడియాకు వివరించారు. అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.


13 మంది బందీలు మృతి


ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు, విదేశీయులు సహా 150 మంది పౌరులను బందీలుగా తరలించుకుపోయారు. వారిని విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ సైనిక చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆయా చోట్ల దాదాపు 13 మంది బందీలు మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది.