Solar Eclipse October 2023 Ring of Fire: ఈ నెల 14న ఏర్పడనున్న సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్ ఆఫ్ ఫైర్' (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. అయితే, ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనుంది. ఈ దేశాల్లో 'రింగ్ ఆఫ్ ఫైర్' 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడే కనిపించనుంది. ఇలాంటి గ్రహణం మళ్లీ 2046లోనే ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
నాసా ప్రత్యక్ష ప్రసారం
సూర్య గ్రహణం వేళ ఏర్పడే అద్భుత వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నాసా సైంటిస్టులు సూచిస్తున్నారు. అక్టోబర్ 14 (శనివారం) మధ్యాహ్నం 4:30 గంటలకు అంతరిక్షంలోని ఈ అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా, ఈసారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించడం లేదు. గ్రహణం యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్‌లో ఉదయం 9:13కి ప్రారంభమవుతుంది మరియు కాలిఫోర్నియా, నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో, టెక్సాస్ మీదుగా కొనసాగుతుంది.
ఇలా చూడండి
ఈ దృశ్యాన్ని నేరుగా కంటితో చూడడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సురక్షిత సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్, హ్యాండ్ హెల్డ్ సోలార్ వ్యూయర్ ను ఎల్లప్పుడూ ఉపయోగించాలని సూచిస్తున్నారు. సాధారణ సన్ గ్లాసెస్, కెమెరా లెన్స్, బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ద్వారా దీన్ని వీక్షించడం సురక్షితం కాదని పేర్కొంటున్నారు.
రింగ్ ఆఫ్ ఫైర్ ఏంటంటే.?
అక్టోబర్ 14న ఏర్పడేది కంకణాకార సూర్య గ్రహణం (రింగ్ ఆఫ్ ఫైర్). చంద్రుడు తన కక్ష్యలో భూమి నుంచి తన సుదూర బిందువు వద్ద లేదా సమీపంలో ఉన్నప్పుడు ఎన్యూలర్ సూర్య గ్రహణం (Solar Eclipse) సంభవిస్తుంది. దీని వల్ల ఆకాశంలో చంద్రుడు సూర్యుని కంటే చిన్నగా కనిపిస్తాడు. ఈ క్రమంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సూర్యుడు ప్రకాశవంతమైన ముఖంపై చంద్రుడు ఓ చీకటి డిస్క్ మాదిరిగా కనిపించడం వల్ల 'రింగ్ ఆఫ్ ఫైర్' ఏర్పడుతుంది.
మొత్తం 4 గ్రహణాలు
ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడుతుండగా, ఇప్పటికే రెండు పూర్తయ్యాయి. ఏప్రిల్ 20న తొలి సూర్య గ్రహణం, తర్వాత మే 5న చంద్ర గ్రహణం ఏర్పడింది. అయితే, ఈసారి ఒకే నెలలో అక్టోబర్ 14న సూర్య గ్రహణం, అక్కడికి 2 వారాల్లోనే చంద్ర గ్రహణం కూడా సంభవించనుంది. దీంతో పాటు మరెన్నో ఖగోళ వింతలు, అద్భుతాలకు అక్టోబర్ వేదిక కాబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ తేదీల్లో ఉల్కాపాతం
గ్రహణాలతో పాటు అక్టోబర్ 21 - 22న ఓరియోనిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మళ్లీ 2061లో దర్శనమీయనుంది. కాగా, ఈ నెల 10న అద్భుతమైన డ్రాకోనిడ్స్ ఉల్కాపాతం ఉద్భవించినట్లు తెలిపారు.