యూకేలో హమాస్‌ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. హమాస్‌ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్‌ వీధుల్లో సంబరాలు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు సంబరాలు చేసుకోవడంపై యూకే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయవచ్చని, లండన్‌ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 


నెటిజన్ల మండిపాటు


హమాస్‌ మద్దతుదారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారని, అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దాడి చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకోవడం దుర్మార్గమని, హమాస్‌ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వమ అని ట్వీట్లు చేస్తున్నారు. 


హమాస్‌కు మద్దతుగా యుద్దంలోకి హెజ్బొల్లా


ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ హెజ్బొల్లా కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద పడ్డాయి. ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ప్రయోగించినట్లు వెల్లడించింది. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది. మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొడుతున్నాయి


ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 500


ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 500 దాటగా.. 1500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హమాస్‌ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.