హమాస్, రష్యా రెండూ ఒక్కటేనని, హమాస్, రష్యాను ఎన్నటికీ గెలవనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకుఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయని, ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. హమాస్, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నాయని, ఓ విషయంలో మాత్రం ఆ రెండింటి లక్ష్యం ఒకటేనన్నారు బైడెన్. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనే కోరుకుంటున్నారని మండిపడ్డారు. హమాస్, రష్యా ముప్పులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తామని, అమెరికా ప్రయోజనాలకు కీలకమని స్పష్టం చేశారు.
గాజాలో చర్చిపై దాడి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిలో దాదాపు 500 మంది మృతి చెందారు. తాజాగా గాజాలోని చర్చిపై దాడి జరిగింది. శరణార్థులు ఆశ్రయం పొందుతున్న గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి ప్రాంగణంలో ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేసిందని హమాస్ వెల్లడించింది. ఈ దాడిలో పలువురు మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని తెలిపింది. అయితే ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గాజా నుంచి పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీ ప్రజలు మృతి చెందారని నెతన్యాహు తెలిపారు. మరోవైపు అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 3,785 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు.
గాజాపై ఆగని దాడులు
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందన్నారు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. అలాగే, మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదన్నారు జోబైడెన్.
ఆస్పత్రిపై దాడి హమాస్ పనే
సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేయలేదన్నారు జో బైడెన్. అది ఇజ్రాయెల్ పని కాదన్న ఆయన, ఆ దాడికి కారణం ఏంటనే విషయం కచ్చితంగా తెలియదన్నారు. హమాస్ మిలిటెంట్లు 1300 మందిని చంపారని, వారిలో 31 మంది అమెరికన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. హమాస్ మిలిటెంట్లు కొందర్ని బందీలుగా చేసుకోవడం దారుణమన్నారు. అది మిలిటెంట్ల పనేనన్న ఆయన, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఇదే చెప్పానన్నారు. ఆసుపత్రిపై దాడి ఘటన తనకెంతో ఆగ్రహం కలిగించిందన్నారు బైడెన్. హమాస్ మిలిటెంట్లపై పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలోని ఆసుపత్రిపై దాడికి ఇజ్రాయెల్ బాధ్యత కాదని అమెరికా చెప్పడాన్ని హమాస్ తోసిపుచ్చింది. అది అవాస్తవమని, కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకే అలా చెప్పిందని మండిపడింది.