Hajj 2024: ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా హజ్ యాత్ర చేయాలని అనుకుంటారు.  ఈ ఏడాది హజ్ యాత్రకు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింలు సౌదీ అరేబియా చేరుకున్నారు. అయితే అక్కడ విపరీతమైన వేడి కారణంగా వందలాది మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దీంతో సౌదీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. ప్రజలు తమ వారి  మృతదేహాలను సేకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. హజ్ యాత్ర సమయంలో వేడి కారణంగా మరణించిన వారి సంఖ్యపై సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించలేదు. మరణాలకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే, వందలాది మంది ప్రజలు మక్కా సమీపంలోని అల్-ముయిసమ్‌లోని ఎమర్జెన్సీ కాంప్లెక్స్ వద్ద లైన్‌లో నిలబడి, తప్పిపోయిన వారి కుటుంబ సభ్యుల గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.


ఆన్‌లైన్‌లో షేర్ చేసిన లిస్టు ప్రకారం హజ్ లో ఈ  ఐదు రోజుల్లో  1,081 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి 18 లక్షల మంది ముస్లింలు ఈ యాత్రలో పాల్గొన్నారు. సోమవారం మక్కాలో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. మరణించిన వారిలో 600మంది వరకు ఈజిఫ్టియన్లే ఉన్నట్లు అరబ్ దౌత్యవేత్త చెప్పారు. అంతకు ముందు రోజు ఈ సంఖ్య 300గా నమోదైంది.  ఇప్పటివరకు 1000మందికి పైగా మరణించినట్లు వివిధ దేశాలు విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.   


68మంది భారతీయులు మృతి
ఈ ఏడాది భారత్ నుంచి 1,75,000 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లారు. హజ్ యాత్రలో 68 మంది భారతీయులు మరణించారని సౌదీ అరేబియాలోని ఒక దౌత్యవేత్త తెలిపారు. కొందరు సహజ కారణాల వల్ల మరణించారని ఒక అధికారి చెప్పారు. మరణించిన వారిలో చాలా మంది వృద్ధ యాత్రికులు కూడా ఉన్నారు. వాతావరణం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఈజిప్టుతో పాటు, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా,  ఇరాక్, కుర్దిస్తాన్ లకు చెందిన వారు మరణించిన వారిలో అధికంగా ఉన్నారు.  


సౌదీలో పెరుగుతున్న ఉష్ణోగ్రత 
 ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు తప్పిపోయిన వ్యక్తుల ఫోటోలతో నిండిపోయాయి. ప్రజల వద్ద సమాచారం ఉంటే తెలియజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఇస్లాం పవిత్ర ప్రార్థనా స్థలాల్లో హజ్ ఒకటి.  ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కాను దర్శించుకునేందుకు వెళ్తారు.   ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. దాదాపు అన్ని గల్ఫ్ దేశాలు దీని బారిన పడుతున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాలలో వేడితో పాటు భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు ప్రతి  పదేళ్లకు 0.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రత సాధారణంగా 45 డిగ్రీలు ఉంటుంది. ఈ ఏడాది ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది.  మక్కా  మసీదులో ఈ ఏడాది ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. గతంలో కూడా సౌదీలో హజ్ యాత్ర సందర్భంగా తొక్కిసలాట వంటి ఘటనల్లో వేలాది మంది చనిపోయారు.