Greece Wildfire: కొన్ని రోజులుగా గ్రీస్ లో కార్చిచ్చు అడవులను దహించి వేస్తోంది. నార్త్ గ్రీస్ లోని అటవీ ప్రాంతంలో చెలరేగిన దావానలం.. పచ్చదనం అనేది లేకండా అన్నింటిని బూడిద చేస్తూ ధ్వంసం చేస్తోంది. అయితే తాజాగా.. నార్త్ గ్రీస్ లోని అటవీ ప్రాంతంలో 18 మృతదేహాలను గుర్తించినట్లు గ్రీక్ ఫైర్ సర్వీస్ మంగళవారం నివేదించింది. ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు వలసదారులై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో బ్రిటీష్ మీడియా నివేదిక ఇచ్చింది. ఈశాన్య గ్రీస్ లోని ఎవ్రోస్ ప్రాంతంలోని టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న అడవి మంటల కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. తాజాగా కనుగొన్న 18 మృతదేహాల బాధితులు చట్టవిరుద్ధంగా గ్రీస్ లోకి ప్రవేశించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక నివాసితులు తప్పిపోయినట్లు ఎలాంటి కేసూ నమోదు కాలేదు కాబట్టి, ఈ వ్యక్తులు అక్రమ వలసదారులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అగ్నిమాపక సేవా ప్రతినిధి యూనిస్ ఆర్టోపోయోస్ తెలిపారు.


ద్వీప సమూహం గ్రీస్‌ను కార్చిచ్చు చుట్టేస్తోంది. ఇటీవల గ్రీస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంట్రీగేడ్‌లు దాటడంతో కార్చిచ్చు అంటుకుంది. పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు, హోటళ్లను దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తోంది.  రోడ్సే ప్రాంతంలో దాదాపు వారం క్రితం రేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ మధ్యగ్రీస్‌, తూర్పు ప్రాంతాల్లోకి  వ్యాపిస్తున్నాయి. 


మంటలను ఆర్పేందుకు ఈ చిరు దేశం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 40 ఫైర్‌ ఇంజిన్లు, 200 మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. మూడు విమానాలు, ఐదు హెలికాప్టర్లు ఈ మంటలను ఆర్పేందుకు ఉపయోగిస్తున్నాయి. ఐరోపా సమాఖ్య దేశాలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. తుర్కియే, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌, క్రొయేషియా దేశాలు సైతం గ్రీస్‌ను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందించి అండగా నిలిచాయి. తాజాగా ఈ కార్చిచ్చు కోర్ఫు ప్రాంతానికి వ్యాపించాయి. రాత్రివేళల్లో వేగంగా వ్యాపిస్తూ కొండలు అగ్నిపర్వతాలను తలపిస్తున్నాయి. ఇవి ఆగ్నేయ దిశగా వ్యాపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ కార్చిచ్చును కొంత అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?


కొన్నిరోజుల క్రితం హవాయి మౌయి దీవిలో కార్చిచ్చు


ఇహలోకపు స్వర్గంలా ఉండే హవాయి ద్వీపంలోని మౌయి దీవి ఇప్పుడు కాలి బూడిదైపోయింది. కార్చిచ్చు ఈ ప్రాంతంలో తీవ్రాతితీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ దీవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు పైగా చేరింది. ఈ మంటల ధాటికి ఏకంగా 3 వేలకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయి. శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. వెయ్యి డిగ్రీల ఫారెన్‌హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోయాయి. 2 వేల 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. రిసార్టు నగరం లహైనా కూడా గుర్తు పట్టలేని స్థితికి మారిపోయింది. ఆ ఘోర ప్రకృతి విపత్తు వల్ల ఏకంగా 50 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు చెలరేగిన సమయంలో అధికారులు ప్రజల సెల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం పంపారని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రమాదాన్ని చేరవేసినప్పటికీ అది అందరికీ చేరలేదని సమాచారం.