POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విదేశీ భూభాగమని దానిపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టు ముందు అంగీకరించింది. కాశ్మీరీ కవి, జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ శుక్రవారం (మే 31) ఈ విషయాన్ని అంగీకరించారు. ఇస్లామాబాద్ హైకోర్టు అహ్మద్ ఫర్హాద్ షా కేసును విచారించింది. మే 15న రావల్పిండిలోని అతని ఇంటి నుంచి అహ్మద్ ఫర్హాద్‌ను పాకిస్థాన్ నిఘా వర్గాలు కిడ్నాప్ చేశాయి.  


అహ్మద్ ఫర్హాద్ మే 14న అదృశ్యం
కాశ్మీరీ కవి అహ్మద్ ఫర్హాద్ జాడకు సంబంధించిన కేసును రద్దు చేయాలన్న అభ్యర్థనను ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అతనిని కోర్టు ముందు హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది. ఫర్హాద్ మే 14న రావల్పిండి నుండి అదృశ్యమయ్యాడు. అతని భార్య ఉరుజ్ జైనాబ్ అతనిని కనిపెట్టాలని ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి)లో పిటిషన్ దాఖలు చేశారు. తిరుగుబాటు కవిత్వానికి ప్రసిద్ధి చెందిన అహ్మద్  ఫర్హాద్..  అతని ఇంటి నుండి పాక్ నిఘా వర్గాలు కిడ్నాప్ చేశాయి.  అంతకుముందు బుధవారం అటార్నీ జనరల్ మన్సూర్ ఉస్మాన్ అవాన్ హైకోర్టుకు అహ్మద్ ను 'అరెస్టు' చేశామని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు.


కశ్మీర్ కు సొంత రాజ్యాంగం
అహ్మద్ ఫర్హాద్ షా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో పోలీసు కస్టడీలో ఉన్నాడని, ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరుపరచలేమని పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ శుక్రవారం జస్టిస్ కయానీ ముందు వాదించారు. అదనపు అటార్నీ జనరల్ కశ్మీర్ దాని స్వంత రాజ్యాంగం, దాని స్వంత కోర్టులతో కూడిన విదేశీ భూభాగమని అక్కడ పాక్ చట్టాలు చెల్లవని తెలిపారు. పీవోకే విదేశీ భూభాగమైతే, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తానీ రేంజర్లు అక్కడ ఎలా ప్రవేశించారని జస్టిస్ కయానీ ప్రశ్నించారు.  ప్రజలను బలవంతంగా అపహరించే పద్ధతిని కొనసాగిస్తున్నందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై జస్టిస్  కయానీ మండిపడ్డారు. కోర్టులో చర్చ సందర్భంగా అహ్మద్ ఫర్హాద్ షాను ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అతనిపై పీఓకేలో రెండు కేసులు నమోదయ్యాయి.


కోర్టు ముందు హాజరు పరచాల్సిందే
జూన్ 2వ తేదీ వరకు అహ్మద్ ఫర్హాద్ షాను కస్టడీలో ఉంచుతామని,  అతడి కుటుంబసభ్యులు ఆయన్ను కలిసేందుకు అనుమతిస్తున్నారని ప్రభుత్వం తరఫున అదనపు అటార్నీ జనరల్  ఇక్బాల్ కోర్టుకు తెలిపారు. అక్రమ జైలు శిక్ష కేసును ముగించాలని ఇక్బాల్ కోర్టును కోరారు.  అహ్మద్ ఫర్హాద్ షా కుటుంబం పీఓకేలోని ధీర్కోట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని, అయితే అతను అక్కడ లేడని ఫర్హాద్ తరపు న్యాయవాది వాదించారు. అనంతరం అహ్మద్ ఫర్హాద్ షాను విచారణ నిమిత్తం ముజఫరాబాద్‌కు తరలించినట్లు కుటుంబీకులకు తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ కయానీ కేసును మూసివేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించారు.  ఫర్హాద్‌ను కోర్టులో హాజరుపరిచే రోజుతో కేసు ముగుస్తుందని చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 7న జరగనుంది.