Israel Gaza war: ఇజ్రాయేల్ రఫాపై దాడి (Attack on Rafah) చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులూ ఉండడం అలజడి రేపింది. సోషల్ మీడియాలోనూ ఇజ్రాయేల్‌ని టార్గెట్ చేస్తూ నెటిజన్‌లు పోస్ట్‌లు పెడుతున్నారు. All Eyes on Rafah హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఓ ఇమేజ్ కూడా వైరల్ అవుతోంది. దీనికి ఇజ్రాయేల్ కౌంటర్ ఇచ్చింది. గతేడాది ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మీ కళ్లు ఏమైపోయాయని మండి పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరో హ్యాష్‌ట్యాగ్ కూడా (AllEyesOnManipur) ట్రెండ్ అవుతోంది. భారత్‌లో "But no eyes on Manipur" అనే టాపిక్‌ని వైరల్ చేస్తున్నారు.
ఇండియాలో చాలా మంది ప్రముఖులు రఫాపై దాడి గురించి పోస్ట్‌లు పెడుతున్నారు. మరి మణిపూర్ సంగతేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మణిపూర్‌లో ఆ స్థాయిలో విధ్వంసం జరిగితే ఎవరూ ఏమీ మాట్లాడలేదని మండి పడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడుతున్న వాళ్లు ఇండియాలో జరుగుతున్న హింసాకాండ గురించి మాట్లాడరేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యూజర్స్ #noeyesonmanipur హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. మణిపూర్ ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని తేల్చి చెబుతున్నారు.
మణిపూర్ విధ్వంసం..
ఏడాది క్రితం మణిపూర్‌లో కుకీ, మైతేయి వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. రిజర్వేషన్‌ల విషయంలో మామూలుగా మొదలైన ఘర్షణ ఆ తరవాత తీవ్రమైంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. బాంబులు విసురుకున్నారు. గతేడాది మే నెలలో ఈ అల్లర్లు మొదలయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 226 మంది మృతి చెందారు. గతేడాది జులైలో కుకీ తెగకు చెందిన ఓ మహిళను నగ్నంగా రోడ్డుపై నడిపిస్తూ దాడి చేసిన వీడియో వైరల్ అవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ హింసాకాండ రాజకీయంగానూ దుమారం రేపింది. రాహుల్ గాంధీ అక్కడ పర్యటించారు. ప్రధాని మోదీపై తీవ్రంగా మండి పడ్డారు. పార్లమెంట్‌నీ ఈ అంశం కుదిపేసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
Also Read: Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 20 గంటలు ఆలస్యం, షోకాజ్ నోటీసులిచ్చిన ఏవియేషన్ శాఖ