China Rocket Debris: చైనాకు చెందిన భారీ రాకెట్ శిథిలాలు భూమిపై పడనున్నాయి. 23 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ శిథిలాలు శుక్రవారం నాడే భూమిపై పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో వివిధ దేశాలకు చెందిన స్పేస్ స్టేషన్ ఉన్న విషయం తెలిసిందే. చైనా తన కోసం ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తోంది. చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు కూడా దాదాపు తుది దశకు వచ్చాయి. 


చైనా తన న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం చివరి భాగాన్ని సోమవారం విజయవంతంగా ప్రారంభించింది. దీని కోసం చివరి మాడ్యూల్ ను భూమి నుండి అంతరిక్షానికి పంపించింది. ఈ మాడ్యూల్ ను లాంగ్ మార్చ్ 5బి రాకెట్ తో విజయవంతంగా చేరవేసినట్లు చైనా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 5బి రాకెట్ విజయవంతంగా మాడ్యూల్ ను స్పేస్ స్టేషన్ కు చేరవేసిన తర్వాత అది తిరిగి భూమి పైకి వస్తుంది. అలా భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపై సముద్రంలో పడుతుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీ ఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం మొదలు అవుతుంది. శనివారం అంతా ఇది కొనసాగుతుంది. 


అత్యధిక వేగంతో పై నుండి కిందకు వస్తున్న సమయంలో ఈ  భారీ రాకెట్ లోని కొన్ని భాగాలు కాలిపోతాయి. మిగిలిన భాగాలు భూమిపై పడతాయి. ఈ రాకెట్ భారీ పరిమాణంలో ఉంటుంది. దాదాపు 10 అంతస్తుల భవనం అంత పెద్దగా 23 టన్నుల బరువుతో ఉంటుంది. ఇప్పుడు భూమిపై పడనున్న 5బి రాకెట్ శకలాలు భూమిపై ఎక్కడ పడతాయన్నది శాస్త్రవేత్తలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అలా ఈ శిథిలాల వల్ల ప్రజలకు కొంత ప్రమాదం పొంచి ఉందని ఏరోస్పేస్ కార్పొరేషన్ అప్రమత్తం చేస్తోంది. 



రాకెట్ శిథిలాలు 88 శాతం జనాభా నివసించే ప్రాంతాల్లోనే పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జన సాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ శాతం పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం కూడా ఉంది. అలా జన సంచారం లేని చోట పడితే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని వేగంగా నిర్మిస్తోంది. అయితే ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం అవసరం అయ్యే మాడ్యూళ్లను తరలించేందుకు చైనా ఈ 5బి రాకెట్ ను ప్రయోగిస్తూ వస్తోంది. అలా 2020 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ రాకెట్ తోనే మాడ్యూళ్లను చేరవేస్తోంది. అంతకుముందు చైనా ప్రయోగించిన మూడు రాకెట్లు కూడా ఇలాగే భూమిపై పడిపోయాయి. 2021లో ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి రాకెట్ శిథిలాలు మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. అలాగే ఈ ఏడాదిలో ప్రయోగించిన రాకెట్ శకలాలు మలేసియా, ఇండోనేసియా సమీపంలోని ఓ ద్వీపంలో, ఫిలిప్పీన్స్ సమీపంలోని ఓ సముద్రంలో పడిపోయాయి.