భారతదేశంలో ‘మానవ హక్కుల ఉల్లంఘనల పెరుగుతున్నా’యని US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చేసిన ఇటీవలి వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో మానవహక్కుల పరిస్థితిపై తమకు అభిప్రాయాలు ఉన్నాయని, చర్చ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడేందుకు వెనకాడబోమని తేల్చిచెప్పారు.


దేశ విధానాల గురించి ప్రజలు అభిప్రాయాలు కలిగి ఉండేందుకు ప్రజలు అర్హులని అన్నారు. అదే సమయంలో ప్రజల ఆసక్తుల గురించి కేంద్రానికి కూడా వివిధ అభిప్రాయాలు ఉండొచ్చని అన్నారు. అంతేకాక, న్యూయార్క్‌లో సిక్కు యువకులపై జరిగిన దాడి అంశంపైకూడా  విదేశాంగ మంత్రి తొలిసారి స్పందించారు.


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు భారత్-అమెరికా 2+2 మంత్రుల చర్చల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌లో మంత్రుల సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇటీవలి ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తోందని అన్నారు. అందులో ఆయన ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంటూ ప్రస్తావించారు. జైలులో, పోలీసు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


అయితే, ఈ భేటీలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని, గతంలోనే చర్చ జరిగిందని జైశంకర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ అంశం ఇంతకు ముందు చర్చకు వచ్చింది. విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ భారత్‌కు వచ్చినప్పుడు ఇది తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ మీకు గుర్తుంటే, ఈ విషయం గురించి నేను చాలా సార్లు చెప్పాను.’’ అని అన్నారు.


ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలను మరింతగా పెంచుకొనే ప్రాముఖ్యతను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఉద్ఘాటించారు. మంగళవారం వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో జరిగిన అమెరికా - ఇండియా ఉన్నత విద్యా సంభాషణలో భాగంగా జైశంకర్ బ్లింకెన్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. తన ప్రసంగంలో బ్లింకెన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారతదేశం ఒకదాన్నుంచి మరొకటి  నేర్చుకోవలసినవి ఎప్పుడూ ఉంటాయి. ఈ చర్చలు ముఖ్యంగా విద్యా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాయి. కొత్త ఇండో-యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి.