England cricket team captain Ben Stokes : ప్రతిభను చూపించుకుని తెచ్చుకున్న మెడల్స్ వాటి బంగారం విలువ సరిపోదు. అవి ఎంతో విలువైనవి. ఉదారహణకు ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చుకుంటే అందులో అరగ్రాము బంగారం ఉన్నా... దాని విలువను అంచనా వేయడం కష్టం.అది పోతే వారికి ఎంత బాధ ఉంటుంది ?. మరో అరగ్రాము బంగారం పెట్టి చేయించుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ మెడల్ వెనుక ఉన్న చరిత్ర వేరు. ఇంగ్లాండ్ క్రికెట్ టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇప్పుడు అలాంటి వేదన అనుభవిస్తున్నారు. తన కెరీర్‌లో ఎంతో గొప్పగా ఆడి సాధించిన మెడల్స్ తో పాటు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ మెడల్ కూడా కనిపించకుండా పోయింది.
కనిపించకుండా పోవడం అంటే .. దొంగలు వచ్చి ఎత్తుకెళ్లడం అన్నమాట. నార్త్ ఈస్ట్ కాస్లే ఈడెన్ అనే ఏరియాలో బెన్ స్టోక్స్ నివాసం ఉంటారు. ఆయన ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఊళ్లో లేని సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. ముసుగులు ధరించిన దొంగలు తన ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు, మెడల్స్ తీసుకెళ్లారని గుర్తించారు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదృష్వశాత్తూ వారికేమీ హాని కల్పించలేదని కానీ తీసుకెళ్లిన ఆభరణాలు, మెడల్స్ తనకు ఎంతో ముఖ్యమైనవి.. విలువైవని ఆయన చెబుతున్నారు. అందుకే దొంగలకు సోషల్ మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిలో బెన్ స్టోక్స్ తెలివిగా వ్యవహరించారు. తన బాధ చూసి ఎవరైనా తెచ్చి ఇవ్వాలనకుంటే వారిని దొంగలుగా అనుమానించబోనని ఆయన సంకేతాలు ఇచ్చారు. అందుకే తాను కొన్ని ఫోటోలు పోస్టు చేస్తున్నానని వాటిని పోలినవి ఎవరి దగ్గర అయినా ఉంటే తీసుకొచ్చి ఇచ్చేయాలని కోరారు. అంటే తీసుకెళ్లిన వారు మారు మనసు పొంది తెచ్చిస్తారని ఆయన అనుకుంటున్నారు.
తాను పోలీసులకూ ఫిర్యాదు చేశానని ఆయన చెబుతున్నారు. తాను పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటనలో పోలీసులు తన కుటుంబానికి అండగా నిలిచారన్నారు. వారు దొంగల కోసం వెదుకుతున్నారని చెప్పుకొచ్చారు. బెన్ స్టోక్స్ పాకిస్థాన్ పర్యటనలో విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో అతడి సారథ్యంలోని ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. పాకిస్థాన్ స్పిన్నర్ల ధాటికి నిలువలేక 1-2తో సిరీస్ పోగొట్టుకుంది. ఆ ఓటమితో పాటు ఇంట్లో దొంగలు పడటం ఆయనను మరింతగా కుంగదీసింది.