నీ జీతం బంగారం గానూ అని ఎవరిరైనా అనొచ్చు కానీ ఆ కంపెనీ వాళ్లను మాత్రం అనకూడదు. ఎందుకంటే వాళ్ల జీతం నిజంగానే బంగారం అయిపోయింది. వాళ్ల జీతంగా బంగారంగానే ఇస్తున్నారు. నెలాఖరు వచ్చిందంటే బ్యాంకు అకౌంట్‌లో జీతం పడిందా లేదా అని ప్రభుత్వ , ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు చెక్ చేసుకుంటూ ఉంటారు. అది కామనే. కానీ లండన్‌లోని ఆ కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ జీతం డబ్బు బ్యాంక్‌లో పడిందో లేదో మాత్రం చూసుకోరు. ఎందుకంటే వారికి జీతాన్ని డబ్బుల రూపంలో ఇవ్వరు. బంగారం రూపంలో ఇస్తారు. మీరు చదువుతున్నది నిజమే. నెలంతా పని చేసిన ఉద్యోగులకు తాము ఇక జీతం డబ్బుల రూపంలో ఇవ్వబోమని.. బంగారం రూపంలో ఇస్తామని చెబుతోంది.దానికి ఉద్యోగులు కూడాఎగిరి గంతేసి అంగీకరించారు. అలా ఎందుకిస్తున్నారు..? ఆ కంపెనీ ఏమిటి ? అంటే..
లండన్‌లో టాలీ మనీ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ పేరు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇది ఆర్థిక సేవల కంపెనీ అని. ఈ కంపెనీ సీఈవో రోజు రోజుకు తగ్గిపోతున్న తమ దేశ కరెన్సీ అయిన పౌండ్ గురించి తెగ ఆలోచించారు. ఇంతగా పౌండ్ విలువ తగ్గిపోతూంటే.. తమ ఉద్యోగులకు ఇస్తున్న జీతం కూడా తగ్గిపోతున్నట్లుగా ఆయన ఫీల్ అయ్యారు. అఫ్ కోర్స్ తన జీతంపై కూడా ఆయనకు బెంగ పట్టుకుందనుకోండి.. అది వేరే విషయం. బాగా ఆలోచించి.. ఇక పౌండ్లలో జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగులకు అన్యాయం చేసినట్లవుతుందని డిసైడయ్యారు. మరి ఏమివ్వాలని కూడా ఆలోచించాడు. బంగారం విలువ అంతకంతకూ పెరుగుతోంది. బంగారాన్నే ఇస్తే...జీతం మనం పెంచకుండానే.. బంగారమే పెంచుకుంటూ పోతుందని ఫీలయ్యాడు. తన నిర్ణయాన్ని ఉద్యోగులకు చెప్పాడు. ఉద్యోగులు కూడా అంగీకరించారు.
ప్రస్తుతం టాలీమనీ కంపెనీలో సీనియర్ ఉద్యోగులకు ఇప్పటికే బంగారం రూపంలో జీతం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల నుంచో వచ్చె నెల నుంచో ఇతర ఉద్యోగులకూ బంగారమే జీతంగా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరెన్సీకి విలువ తగ్గిపోతుందని.. బంగారమే అన్నింటికీ సరైన ఆన్సరనీ.. టాలీమనీ యజమాని నమ్ముతున్నారు.
టాలీమనీ వచ్చే సంక్షోభాన్ని చాలా బాగా ఎదుర్కోవడానికి సిద్ధమయిందని ఇతర సంస్థల ఉద్యోగులు కూడా అంటున్నారు. మొత్తంగా తాము తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఇతర పెద్ద కంపెనీలు కూడా త్వరలోనే వస్తాయని టాలీమనీ సీఈవో చెబుతున్నారు. అది నిజమో కాదో కానీ.. పొదుపు చేసుకోవడానికి బంగారం బాగానే ఉంటుంది కానీ మరీ రోజువారీ ఖర్చులు..ఈఎంఐల కోసం ఏంచేయాలని కొంత మంది గొణుక్కుంటున్నారు. వారి బాధ వారిది.