El Nino Effect 2023:



2024 ఏప్రిల్ వరకూ ప్రభావం..


El Nino News: ఎల్‌నినో ప్రభావం (El Nino Effect) వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 2024 ఏప్రిల్ వరకూ ఈ ఎఫెక్ట్‌ తప్పక ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అన్ని దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ అనూహ్య మార్పులకు కారణంగా ఎల్‌నినోయే అని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన World Meteorological Organization కూడా ఇదే విషయం వెల్లడించింది. ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్య కాలంలో ఏర్పడిన ఎల్ నినో జనవరి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదముందని చెప్పింది.


రానున్న రోజుల్లో ఈ ప్రభావం పెరిగేందుకు 90% మేర అవకాశాలున్నాయని అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ మహా సముద్రం జలాలు వేడెక్కడం వల్ల ఈ ఎఫెక్ట్‌ మొదలవుతుంది. రెండు లేదా ఏడేళ్లకోసారి ఈ ప్రభావం కనిపిస్తుంది. ఒక్కసారి ఇది ఏర్పడ్డాక ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అయితే...వాతావరణ మార్పుల కారణంగా ఎల్‌నినో ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటోందని అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. ఇప్పటి వరకూ 2016లో చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పట్లో ఎల్‌ నినో ఎఫెక్ట్‌ బాగా పడింది. ఇప్పుడా రికార్డుని బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటోంది ఐక్యరాజ్య సమితి. 


"జూన్ నుంచి సముద్ర జలాలు, భూతల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ వస్తున్నాయి. 2023 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా రికార్డుకెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందుకు కారణం కర్బన ఉద్గారాలు ఎక్కువగా గాల్లో కలుస్తుండడం. వేడి గాలులు, కరవు, కార్చిచ్చులు, భారీ వర్షాలు, వరదలు...ఇలా ఎన్నో విధాలుగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి విపత్తులపై ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ ఉండాల్సిన అవసరముంది"


- పెటెర్రీ టాలస్, WMO చీఫ్