Donald Trump charged:


సీక్రెట్ డాక్యుమెంట్స్‌పై ఆరోపణలు..


డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్‌ని ట్రంప్ తన వద్దే అనధికారికంగా వాటిని దాచి పెట్టుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత వైట్‌హౌజ్‌ని ఖాళీ చేసి వెళ్లే సమయంలో కొన్ని కీలక పత్రాలను ట్రంప్ తనతో పాటు తీసుకెళ్లాడన్నది ప్రధాన ఆరోపణ. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో (Mar-a-Lago)రిసార్ట్‌లో వాటిని దాచి పెట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. తనపై కేసులు పెట్టినట్టు చెప్పారు. అధికారులు ఇప్పటికే ఆయన రిసార్ట్‌లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలు దొరికాయి. వాటిని వైట్‌హౌజ్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ట్రంప్ అడ్డుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే...ట్రంప్ మాత్రం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. మియామి ఫెడరల్‌ కోర్టులో హాజరు కావాలని తనకు సమన్లు జారీ చేశారని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని ట్రంప్ తన Truth Social సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 


"అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది అమెరికా చరిత్రలోనే చీకటి రోజు. దేశం ఎలా పతనమవుతోందో చెప్పడానికి ఇదే ఓ ఉదాహరణ. కానీ...మనమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తే మళ్లీ అమెరికా వెలిగిపోయేలా చేయొచ్చు"


- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


హష్ మనీ కేసులోనూ...


అమెరికా చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా నిలిచారు ట్రంప్. ఇప్పటికే ఏడు క్రిమినల్ కౌంట్స్‌తో ట్రంప్‌పై ఆరోపణలు నమోదైనట్టు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ ఈ కేసులో దోషిగా తేలితే మాత్రం కఠినంగానే శిక్షించే అవకాశముంది. ఈ సారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఆయనకు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే హష్ మనీ కేసులో ఇరుక్కున్నారు ట్రంప్. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు 130,000 డాల‌ర్లు (సుమారు రూ.కోటి) చెల్లించార‌ని ట్రంప్‌పై ఆరోప‌ణ‌లున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్ ఈ చెల్లింపు చేశారు. ఈ కేసులో కోహెన్ జైలు శిక్షను ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై క్రిమినల్‌ నేరాభియోగాలు న‌మోద‌య్యాయి. దీంతో అమెరికా చరిత్రలో క్రిమిన‌ల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్‌ నిలిచారు.


ఎన్నో అభియోగాలు..


ట్రంప్‌పై ఏ అమెరికా అధ్య‌క్షుడికీ లేన‌న్ని రిమార్కులు ఉన్నాయి. రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్య‌క్షుడిగా, క్రిమిన‌ల్ కేసులో అభియోగాలు న‌మోదైన తొలి అమెరిక‌న్ ప్రెసిడెంట్‌గా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. వీటితో పాటు అడ‌ల్ట్ స్టార్‌కు డ‌బ్బులిచ్చిన ప్రెసిడెంట్ కూడా ఆయ‌నే. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలోనూ ట్రంప్ రికార్డు నెల‌కొల్పారు. తాను ఎవరినైనా కాల్చగలనని చెప్పిన‌ మొదటి అమెరికా అధ్యక్షుడిగా.. కోపంతో కెచప్ విసిరిన తొలి అమెరిక‌న్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నారు.