ఇండియా, అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పటి నుంచి వేల మంది కుటుంబాలు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ ఉద్యోగాలు చేయడమే కాదు ప్రభుత్వ పాలనలో కూడా భాగం పంచుకుంటున్నారు. భారతీయ సంతతి పెరగడంతో అక్కడ కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం పెరుగుతోంది. ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాల్లో అమెరికన్‌లు పాల్గొని మన ట్రెడిషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు పడింది.
మన సంప్రదాయ పండగ ఏదైనా సరే హడావుడి మామూలుగా ఉండదు. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందడి ఉండనే ఉంటుంది. అందుకే ఇండియాలో ముఖ్యమైన పండగలకు సెలవులు ప్రకటిస్తుంది ప్రభుత్వం. అమెరికాలో ఉన్న వాళ్లకు అది వీలు కాదు. కచ్చితంగా పండగ రోజు అయినా ఆఫీస్‌కు వెళ్లాల్సిందే. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సిందే. అందుకే ఆఫీస్ నుంచి వచ్చాకైనా పూజలు చేసుకోవాలి... లేదంటే వెళ్లే ముందైనా పూజలు చేసుకోవాలి. మరికొందరు లీవ్ తీసుకుంటారు.
సెలవు దినంగా దీపావళి
ఈ పరిస్థితుల్లో న్యూయార్క్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయ పండగల్లో ఒకటైన దీపావళి రోజున సెలవు ప్రకటించారు. దాన్ని ప్రభుత్వ హాలిడేస్ లిస్ట్‌లో పెట్టారు. అయితే ఈసారి ఆ పండగ ఆదివారం వచ్చింది. అయినా ఓ భారతీయ పండగను అమెరికా ప్రభుత్వ హాలిడేస్ లిస్ట్‌లో పెట్టడం గమనించదగ్గ విషయం.
భారతీయ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నందున వారిని గుర్తిస్తున్నామని చెప్పేందుకే ప్రభుత్వ పాఠశాల సెలవుల జాబితాలో చేర్చనున్నట్టు మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. చాంద్రమాన క్యాలెండర్ ఆధారంగా దీపావళి పండుగను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 12న ఆదివారం వచ్చింది. అంటే 2023-24 పాఠశాల క్యాలెండర్ లో ఎటువంటి మార్పు ఉండదు.
రెండు లక్షల మందికిపైగా పండుగను జరపుకుంటారు...
న్యూయార్క్ నగర అధికారులు తెలిపిన వివరాల మేరకు సుమారు రెండు లక్షల మంది నగర వాసులు దీపావళిని జరుపుకుంటారు. వీరిలో హిందువులు, సిక్కులు, జైనులు, కొంతమంది బౌద్ధులు కూడా ఉన్నారు. దీనిపై మేయర్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్ నిరంతరం మారుతున్న నగరమని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజలను స్వాగతిస్తుందని చెప్పారు. రోష్ హషానా, లూనార్ న్యూ ఇయర్‌తోపాటు దీపావళిని కూడా విద్యార్థులకు సెలవు దినంగా ప్రకటించారు. తమ పాఠశాల క్యాలెండర్ వాస్తవికతను ప్రతిబింబిస్తుందన్నారు.
గవర్నర్ సంతకమే తరువాయి..
దీపావళిని ప్రభుత్వ పాఠశాలలకు సెలవుగా పేర్కొంటూ ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ కాథీ హోచుల్ సంతకం చేస్తే కొత్త సెలవు అధికారికంగా మారుతుంది. 2021లో మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు దీపావళిని పాఠశాలకు సెలవు దినంగా ప్రకటిస్తానని ఆడమ్స్ ప్రతిజ్ఞ చేశారు. గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత దీపావళి వేడుకలను నిర్వహించిన హోచుల్, 2023లో శాసనసభ ఆమోదించిన అన్ని బిల్లులను సమీక్షిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది.
పెరుగుతున్న దక్షిణాసియావాసుల సంఖ్యే కారణం..
న్యూయార్క్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ దక్షిణాసియా వాసులకు పెద్ద స్థాయిలో పలుకుబడి ఉండడమే దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు కారణమైందని భావిస్తున్నారు. అక్కడ జనాభా లెక్క ప్రకారం న్యూయార్క్ జనాభాలో భారతీయుల సంఖ్య గత మూడు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యింది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం వీరి సంఖ్య 1990లో 94,000 నుంచి 2021కి దాదాపు 213,000కి పెరిగింది.
Also Read: తైవాన్ లో మీటూ ఉద్యమం- నెట్‌ఫ్లిక్స్ హిట్టే కారణమా!