COVID-19 no longer public health emergency: గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కారణంగా విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కమిటీ గురువారం సమావేశమై కోవిడ్19 వ్యాప్తితో విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగించవచ్చు అని అభిప్రాయపడింది. ఈ మేరకు శుక్రవారం కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 


‘గడిచిన సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ ద్వారా ప్రజల రోగనిరోధక శక్తి పెరిగింది. అదే సమయంలో కరోనా మరణాలు తగ్గాయి. దాంతో వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గింది. చాలా దేశాలు కరోనా నిబంధనల్ని ఎత్తివేశాయి. దాంతో మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగింది అంటూ’ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ కమిటీ నిర్ణయాలను వరుస ట్వీట్లలో డబ్ల్యూహెచ్ఓ అఫీషియల్ అకౌంట్లో వెల్లడించారు.






COVID19 పలు దేశాల మధ్య రాజకీయ తప్పిదాలను బహిర్గతం చేసింది. కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తప్పుడు సమాచారంతో కరోనా మహమ్మారి ప్రజల మద్య, ప్రభుత్వాల మధ్య, సంస్థల మధ్య నమ్మకాన్ని పోగొట్టింది. ప్రపంచంలో అసమానతలను కొవిడ్19 బహిర్గతం చేసింది. పేద, కొన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. చివరికి కరోనా వ్యాక్సిన్ కోట్లాది ప్రజలు తీసుకున్నారు. - డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్






దేశాల సరిహద్దులు మూసివేశారు. కొన్నిచోట్లకే ప్రయాణాలు పరిమితం చేయాల్సి వచ్చింది. విద్యా సంస్థలు మూసివేయడంతో విద్యార్థులు ఎంతగానో నష్టపోయారు. కొన్ని కోట్ల మంది ఒంటరితనంతో ఆందోళన, నిరాశకు గురయ్యారు. వాస్తవానికి COVID19 ఆరోగ్య సంక్షోభం కంటే మరింత తీవ్రమైనది. ఎన్నో ఆరోగ్య, ఆర్థిక సమస్యలను తీసుకొచ్చింది. ట్రిలియన్ల డాలర్ల సంపదను తుడిచిపెట్టింది. బిజినెస్, రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. కొన్ని కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేసింది - డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ట్వీట్


1221 రోజుల కిందట చైనాలోని వుహాన్‌లో తెలియని కారణంతో కొన్ని కొత్త రకం కేసులు నమోదయ్యాయి. 30 జనవరి 2020న అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం సమావేశమైన ఎమర్జెన్సీ కమిటీ సలహా మేరకు కరోనా వ్యాప్తిపై ఆందోళనచెంది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించామని టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ తెలిపారు. ఆ సమయంలో చైనా కాకుండా ఇతర దేశాలలో 100 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి కానీ మరణాలు సంభవించలేదు. ఈ 3 సంవత్సరాలలో, COVID-19 ప్రపంచాన్ని తలకిందులు చేసింది. 7 మిలియన్ల మరణాలు సంభవించినట్లు నివేదికలో ఉంది. కరోనా కారణంగా ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టం వాటిల్లిందని కీలక ప్రకటన చేశారు.