Ukraine :  ఉక్రెయిన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి.  రష్యా దాడులతో  ఆస్తి, ప్రాణ నష్టం భారీగా చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి దాదాపుగా నాలుగు నెలలకు దగ్గరపడుతున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక వైపు బాంబు, ఆయుధాల మోతలతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌కు ఇప్పుడు మరో సమస్య వచ్చి చేరింది. ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన చెత్త, చెదారం, కుళ్లిన శవాలు, భవనాల శిథిలాలు అన్ని కుప్పలా పేరుకుపోయాయి. దీంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటితో కలరా వంటి వ్యాధులు ప్రభావం చూపిస్తున్నాయి.  


శిథిలాల కింద పెద్ద ఎత్తున మృతదేహాలు 


రష్యా  ( Russia )  దాడులకు తీవ్రంగా ప్రభావితమైన మరియుపోల్‌, ఖేర్సన్‌ వంటి నగరాల్లో ఎక్కడ చూసిన భవనాల శిథిలాలు, వాటి కింద కుళ్లిన శవాలు ఉన్నాయి. మరియుపోల్‌లో ఇప్పటికే 10 వేల మందికి పైగా చనిపోయి ఉంటారని అంచనా. దీంతో ఆ మృతదేహాల నుండి దుర్వాసన వస్తోంది. కుళ్లుతున్న శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, బొద్దింకల వంటి కీటకాలు కలరా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


భారీగా బయట పడుతున్న కలరా తరహా వ్యాధులు


కలరాకు ( Cholera )  సంబంధించిన పలు కేసుల గుర్తించామని, దీంతో పాటు అంటు వ్యాధులు ప్రబలే అవకాశముందని మరియుపోల్‌ గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అటు రష్యా దాడులతో నిరాశ్రయులుగా మారిన వారికి ఇప్పుడు కలరా రూపంలో మరో మహమ్మారి పొంచి ఉండటంపై ఐక్యరాజ్యసమితి(UN )  విచారం వ్యక్తం చేసింది. మేలో ఈ నగరం రష్యా వశమైన నాటి నుండి తమకు ఎటువంటి సమాచారం అందడం లేదని ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. 


రష్యా అధీనంలో ఉండటంతో  వైద్యం కూడా అంతంతమాత్రమే


రష్యా మాత్రం వ్యాధి నిర్ధారక పరీక్షలు చేపడుతున్నట్లు చెబుతోంది. మరియుపోల్‌లో (Meria pol ) మురుగు నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీని పట్ల ఐరాస, రెడ్‌క్రాస్‌ హెచ్చరిక చేశాయి. ఇది ఇలా కొనసాగితే అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇక్కడ వైద్య సదుపాయం ఉండటం లేదని, రిటైర్డ్‌ డాక్టర్లను ( Retired Doctors ) ఇక్కడ నియమిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే.. యుద్ధం కన్నా అానారోగ్యం వల్ల చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.