US-China Relations: ఉక్రెయిన్ - రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. దేశాల మధ్య విభేదాలు 'ఎవరికీ ప్రయోజనం లేనివి' అని అన్నారని వార్తా సంస్థ AFP తెలిపింది. శాంతి కోసం చైనా, అమెరికాలు అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించాలని జింగ్ పింగ్ అన్నారు. రష్యాకు చైనా సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించకుండా బీజింగ్‌ను అడ్డుకునేందుకు వైట్ హౌస్ ఇరు దేశాధ్యక్షుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. పుతిన్‌కు బీజింగ్ సపోర్టు, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించకపోవడం పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశంలో లేవనెత్తనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి తెలిపారు. 






రష్యా దాడులను ప్రస్తావించిన జో బైడెన్ 


"అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆలోచనలను అంచనా వేయడానికి ఇదొక అవకాశం" అని ప్సాకి అన్నట్లు అసోసియేటెట్ ప్రెస్(AP) తెలిపింది. నవంబర్‌లో బైడెన్, జింగ్ పింగ్ వర్చువల్ సమ్మిట్‌ తర్వాత నుంచి ఇరు దేశాధ్యక్షుల మధ్య సమావేశం నిర్వహించాలని వైట్ హౌస్ భావించింది. తాజా చర్చలో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు వారాలుగా చేస్తున్న విధ్వంసాన్ని ప్రస్తావించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్, బీజింగ్ ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టాయని తెలుస్తోంది. 


అమెరికా కారణమంటున్న చైనా 


ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందజేయడం ద్వారా రష్యాను అమెరికా మరింత రెచ్చగొట్టి యుద్ధాన్ని ప్రేరేపించిందని చైనా ఆరోపిస్తుంది. రోజువారీ బ్రీఫింగ్‌లో విలేఖరులను ఉద్దేశించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడారు. "పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించడానికి చైనా అన్ని సమయాలలో ప్రయత్నిస్తుంది. ఉక్రెయిన్‌లోని పౌరులకు కావాల్సింది ఆహారం, స్లీపింగ్ బ్యాగ్‌లు లేక మెషిన్ గన్‌లు, ఆయుధాలా అనే సమాధానం చెప్పడం సులభం." అని వ్యాఖ్యానించారు. 


రష్యాకు చైనా సపోర్ట్ 


పశ్చిమ దేశాలు విధించిన కఠినమైన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి రష్యాకు చైనా సహాయ పడుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రష్యాకు సైనిక, ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా రష్యాకు సంకేతాలు ఇచ్చిందని అమెరికా ఆసియా, యూరోపియన్ భాగస్వాములకు తెలియజేసింది.