Pakistan : పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను భారతదేశం తన క్షిపణులతో నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఏదో ప్రతికారం తీర్చుకోవాలని విఫలయత్నం చేసింది. దీన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొంది. అంతే కాకుండా వారి దేశంలోని సైనిక స్థావరాలపై దాడులు చేసి విజయవంతమైంది. అయితే నష్టాన్ని ముందే గ్రహించిన పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకు కారణమైంది. భారత్‌పై పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో IMF పాకిస్థాన్‌కు 2.4 బిలియన్ డాలర్ల సహాయం అందించింది. పాకిస్థాన్‌లో ఈ రుణంపై సంతోషం వ్యక్తమవుతుండగా, భారతదేశంలో మాత్రం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు, ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించవచ్చని చాలా మంది అనుమానపడుతున్నారు. IMF రుణంతో పాకిస్థాన్ భారతదేశంలా S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయబోతుందని చాలా మంది అంటున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.
పాకిస్థాన్ S-400 కొనుగోలు చేయగలదా?
పాకిస్థాన్ S-400 కొనుగోలు చేయడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి ఈ వ్యవస్థను కొనుగోలు చేసే సమయంలో కొన్నింటిని క్లియర్ చేసుకొని ఉంటుంది. పొరుగు దేశాలకు దీన్ని అమ్మకుండా ఉండేలా ఒప్పందం చేసుకొని ఉంటారని అంటున్నారు. అయితే రష్యా వద్ద ఉన్న S-400 వ్యవస్థ పూర్తిగా భిన్నమైందిగా చెబుతున్నారు. భారతదేశం దగ్గర ఉన్న వ్యవస్థలా కాదని, అందులో చాలా మార్పులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు S-400 వ్యవస్థను అమ్మి భారతదేశంతో ఉన్న సంబంధాలు పాడుచేసుకనునే స్థితిలో రష్యా లేదనే వాదన బలంగా ఉంది.
భారతదేశం, రష్యాతో రక్షణ రంగంలో చాలా ఓల్డ్ ఫ్రెండ్స్. రష్యా నుంచి భారతదేశం అనేక ఆయుధాలను కొనుగోలు చేసింది. అందుకే నిపుణులు కూడా పాకిస్థాన్‌కు S-400 ఇవ్వడం తప్పు అని భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ ఈ సాంకేతికతను అమెరికాకు అప్పగించవచ్చు. అలా జరిగితే అది రష్యాకు తీవ్రమైన ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే రష్యా ఇప్పటివరకు కొద్ది దేశాలకు మాత్రమే S-400 అమ్మింది, అవి దానికి చాలా దగ్గరగా ఉన్న దేశాలకు మాత్రమే ఇచ్చింది.
IMF నుంచి వచ్చిన రుణం ఎలా ఉపయోగిస్తుంది
రెండో విషయం ఏమిటంటే, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని బట్టి కు IMF నుంచి ఇంత పెద్ద రుణం వచ్చింది. IMF ఇచ్చే రుణానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని ఆ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఈ రుణం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యం పాకిస్థాన్ ఆర్థిక స్థిరత్వం, ఇతర సంస్కరణలు. పాకిస్థాన్ ఈ డబ్బును వాటి కోసమే ఖర్చు చేయాలి. అంతేకాని రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేయకూడదు. అలా చేస్తే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. తర్వాత దశల్లో పాకిస్థాన్‌కు రుణం ఇవ్వడం ఆగిపోతుంది. సూటిగా చెప్పాలంటే పాకిస్థాన్‌కు ఈ డబ్బు వచ్చిన తర్వాత కూడా S-400 వ్యవస్థను కొనుగోలు చేయడం సులభం కాదు.