Bomb Cyclone in US:


బాంబ్ సైక్లోన్ కారణంగా గడ్డ కట్టించే చలి, విపత్కర పరిస్థితుల్లో  లక్షలాది మంది అమెరికన్లు విద్యుత్ సరఫరాలేక చీకట్లోనే మగ్గుతున్నారు. దాదాపు 60 శాతం మంది ఈ శీతాకాల సైక్లోన్ ప్రభావానికి గురయ్యారు. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం 200 మిలియన్ల మంది ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అలెర్ట్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తలేదని వాతావరణ నిపుణులు తెలిపారు.


నిలిచిపోయిన విద్యుత్ సరఫరా


పవర్ ఔట్‌రేజ్ అనే వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు కోటి 40 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అట్లాంటా, అమెరికాలోని ఉత్తర ప్రాంతాలలో వందలాది మంది ప్రజలు విద్యుత్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ లేక, హీటర్లు పని చేయక జార్జియా ప్రజలు చలికి వణికిపోతున్నారు. 






దాదాపు 5000 విమానాలు రద్దు


ఈ శుక్రవారం దాదాపు 5 వేల వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. ఈ తుపాను ప్రభావం అమెరికా మొత్తంపై పడుతోంది. కెనడాలో టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెస్ట్ జెట్ అన్ని సర్వీసులను రద్దు చేసింది. ఈ దశాబ్దంలో నమోదైన అత్యంత భీభత్సమైన సైక్లోన్ గా వాతావరణ నిపుణులు వెల్లడించారు. మెక్సికోలో అమెరికా సరిహద్దు వద్ద చాలా మంది శరణార్థులు దారుణమైన స్థితిలో వేచి చూస్తున్నారు. అక్కడక్కడా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఒహియో టర్న్‌ పైక్‌లో దాదాపు 50 వాహనాలు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మిచిగాన్‌లోనూ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా దేశంలో అన్ని రహదారులనూ మూసివేశారు. ఈ భయంకరమైన చలి నుంచి నిరాశ్రయులను రక్షించడానికి సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చారు.