Israel Gaza War:



బిన్‌లాడెన్ లేఖ..


అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్‌లాడెన్‌ని (Al Qaida chief Osama bin Laden) 2011లో మట్టుబెట్టింది అమెరికా. అప్పట్లో ఇది అంతర్జాతీయంగా సంచలనమైంది. ఇప్పుడు మరోసారి బిన్‌ లాడెన్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దశాబ్దాల క్రితం లాడెన్ రాసిన ఓ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టిక్‌టాక్‌లో (TikTok Laden Letter) కొంత మంది యూజర్స్ ఈ లెటర్‌ని పోస్ట్ చేశారు. చాలా మంది యూజర్స్‌ దీన్ని రీషేర్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ట్విటర్‌ #lettertoamerica హ్యాష్‌ట్యాగ్‌ని  తొలగించింది. 2002లో 'Letter to America' పేరిట ఓ లెటర్ రాశాడు లాడెన్. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంలో (Israel-Hamas War) ఇజ్రాయేల్‌కి అమెరికా పెద్ద ఎత్తున మద్దతునిస్తున్న నేపథ్యంలో ఈ లెటర్ వైరల్ అవడం కీలకంగా మారింది. మధ్యప్రాచ్యంలోని వివాదాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం వెనక అసలు లక్ష్యం ఏంటో ఈ లేఖలో ప్రస్తావించాడు లాడెన్. The Guardian వెబ్‌సైట్‌లో ఈ లెటర్‌ని పోస్ట్ చేశారు. విమర్శలు రావడం వల్ల వెంటనే తొలగించారు. ఈ లెటర్‌లో లాడెన్‌ తాము అమెరికాతో ఎందుకు పోరాడుతున్నామో చెప్పాడు. "మేం అమెరికాకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నాం..? మీ నుంచి మాకేం కావాలి.." అంటూ లెటర్‌ని మొదలు పెట్టిన లాడెన్‌ చాలా విషయాలు ప్రస్తావించాడు. అమెరికాపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే...ఈ లెటర్‌పై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతోంది. కొందరు దీనికి సపోర్ట్‌గా మాట్లాడుతుంటే మరి కొందరు ఖండిస్తున్నారు. 
 
ఎన్నో వాదనలు..


ఇరాక్‌, అఫ్గనిస్థాన్‌లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుందో మరోసారి ఆలోచించాలంటూ కొందరు వాదిస్తున్నారు. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. చైనాకి చెందిన ByteDance యాప్‌ కావాలనే ఈ లెటర్‌ని వైరల్ చేస్తోందని, అమెరికాలో అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తోందన్న ఆరోపణలున్నాయి. బిన్‌లాడెన్ లెటర్‌లో అమెరికా ఇజ్రాయేల్‌కి మద్దతుగా ఉండడంపైనా విమర్శలున్నాయి. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేస్తోందని మండి పడ్డాడు లాడెన్. అంతే కాదు. అఫ్గనిస్థాన్, ఇరాక్, సోమాలియా, లెబనాన్‌లోని వివాదాల్లో అమెరికా తలదూర్చడాన్నీ తప్పుబట్టాడు. అయితే...దీనిపై అమెరికా గట్టి బదులు చెప్పింది. వేలాది మంది అమెరికా పౌరుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బిన్‌లాడెన్ లెటర్‌ని ఇలా షేర్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. 


ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఖండించారు. Global South Summitలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నామని, ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. హింసని, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధాన్ని కట్టడి చేసే విషయంలో Global South దేశాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Amazon Delivery Agent: కళ్ల ముందే దొంగతనం, ఏమీ చేయలేకపోయిన అమెజాన్ డెలివరీ ఏజెంట్