Biden on Kamala Harris: ఇదేం కంగారు సామీ- కమలా హారిస్‌ను కూడా వదల్లేదుగా!

ABP Desam   |  Murali Krishna   |  17 Mar 2022 08:05 PM (IST)

జో బైడెన్ మాట్లాడేటప్పుడు మరోసారి తడబడ్డారు. ఈసారి ఏకంగా కమలా హారిస్‌ను 'ఫస్ట్ లేడీ' అని సంబోధించారు.

ఇదేం కంగారు సామీ- కమలా హారిస్‌ను కూడా వదల్లేదుగా!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాటు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సీరియస్‌గా మాట్లాడేటప్పుడు కూడా అనుకోకుండా ఒకరి పేరు మొదలు మరొకరి పేరు చెబుతుంటారు బైడెన్. తాజాగా మరోసారి అలానే తప్పు చెప్పి మళ్లీ బైడెన్ బుక్కైపోయారు. అయితే ఈసారి ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను 'ఫస్ట్ లేడీ' చేసేశారు. ఇంకేముంది అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వేశారు. దాంతో వెంటనే నాలుక కరుచుకుని కవర్ చేశారు బైడెన్.

ఇలా జరిగిపోయింది

శ్వేతసౌథంలో జరిగిన ఈక్వల్ పే డే కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరు కాలేదు. ఆ విషయాన్ని చెప్పే సమయంలో బైడెన్.. ఆమెను 'ఫస్ట్ లేడీ'గా సంబోధించారు.

ఈ కార్యక్రమంలో హాజరైన అతిథుల్లో చిన్న మార్పు జరిగింది. 'ఫస్ట్ లేడీ' (అధ్యక్షుడి భార్య) భర్త కరోనాకు గురయ్యారు. అందుకే ఆమె ఇక్కడికి రాలేదు.                                          - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇది విన్న ఆడిటోరియం మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. వెంటనే అక్కడున్న కొంతమంది "అయితే ఫస్ట్ లేడీ భర్త మీరే.. మీకు కొవిడ్ వచ్చిందా" అని అడిగారు. ఇది విన్న బైడెన్‌కు వెంటనే బల్బు వెలిగింది. 

అవును.. కాదు కాదు.. ఇలా పిలిచినా ఆమెకు ఇబ్బంది ఏం లేదు. కమలా హారిస్ 'సెకండ్ లేడీ' భర్తకు కరోనా వచ్చింది. ఇప్పుడు ఓకేనా?                                             - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఈ వారం మొదట్లో కమలా హారిస్ భర్త డగ్లస్​ ఎమహాఫ్​ కరోనాకు గురయ్యారు. 

కొత్తేం కాదు

బైడన్‌కు ఇలా తడబడటం కొత్తేం కాదు. ఇటీవల ఉక్రెయిన్ ప్రజలను.. ఇరానీయన్ ప్రజలుగా బైడెన్ సంబోధించారు. గతేడాది అయితే కమలా హారిస్‌ను 'ప్రెసిడెంట్' అని పిలిచారు.

భారతీయుడు

జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండో-అమెరికన్ డా. ఆశిష్ ఝాను.. శ్వేతసౌథం కొవిడ్ 19 రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయన బ్రౌన్ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్‌గా ఉన్నారు.

Also Read: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై పుతిన్ తగ్గేదేలే! ఐసీజే ఆదేశాలను కూడా లెక్కచేయని రష్యా

 

Published at: 17 Mar 2022 08:03 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.