Bangladesh Riots:కోట వ్యతిరేక ఆందోళనలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరైన షరీఫ్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గమంటోంది. ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్న  వేళ బంగ్లాదేశ్ మళ్లీ అల్లకల్లోలంగా మారింది. ఉగ్రవాద సంస్థలు మళ్లీ చురుగ్గా మారాయి. బంగ్లాదేశ్ అంతటా భారత వ్యతిరేక ఆందోళన మళ్లీ వ్యాపించింది. అందరి కోపం భారతదేశం వైపు మళ్లింది. బంగ్లాదేశ్‌లోని భారత దౌత్యవేత్తల నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నందున ఖుల్నా, రాజ్‌షాహిలోని భారత వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేయడం జరిగింది.

Continues below advertisement

భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఢాకాలోని వీసా దరఖాస్తు కేంద్రం గురువారం తిరిగి ఓపెన్ చేశారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, ఆందోళనకారులు రాజ్‌షాహిలోని భారత అసిస్టెంట్ హైకమిషన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌షాహిలోని భద్ర మోర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను కొంత దూరం వెళ్లిన తర్వాత పోలీసులు ఆపారు. పోలీసులు దాదాపు 100 మీటర్ల దూరంలో ప్రదర్శనను నిలిపివేశారు. నిరసనకారులు అక్కడ ధర్నా నిర్వహించారు. ఖుల్నాలో కూడా ఇలాంటి నిరసనలు ప్రారంభమయ్యాయి.

గత బుధవారం ఢాకాలోని గుల్షన్‌లోని భారత హైకమిషన్‌ను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముందు భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వచ్చాయి. దీని తర్వాత, ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాతో కేంద్రం మాట్లాడింది. ఢాకాలోని భారత హైకమిషన్ భద్రతాపై, ఉగ్రవాదుల కార్యకలాపాలపై భారతదేశ ఆందోళనను వ్యక్తం చేసింది. దీనితో పాటు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, 'బంగ్లాదేశ్‌లో ఇటీవలి ఘటనలకు సంబంధించి ఉగ్రవాదుల తప్పుడు ప్రచారాన్ని భారతదేశం తిరస్కరిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి దర్యాప్తు ప్రారంభించలేదు. దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలను భారతదేశంతో బంగ్లాదేశ్ పంచుకోలేదు.'

Continues below advertisement

బంగ్లాదేశ్‌లో కోట వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరైన షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది మరణ వార్త తర్వాత, దేశంలో విస్తృత నిరసన వ్యక్తమైంది. 'ఇంకిలాబ్ మంచ్' ఫేస్‌బుక్ పేజీలో ప్రచురించిన ఒక ప్రకటనలో, ఉస్మాన్ బిన్ హాది 'భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం'లో 'అమరవీరుడు' అయ్యాడని ఆ పోస్టు సారాంశం. 'భారత వ్యతిరేక ఆధిపత్య పోరాటం' పేరుతో, భారతదేశంపై ద్వేషాన్ని నూరుపోస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, యూనస్ దేశంలో ఇలాంటి ఘటనలు తీవ్ర ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ఎన్నికలకు ముందు కావాలనే బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు రేపుతున్నారు.