Bangladesh Crisis LIVE Updates: బంగ్లాదేశ్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇదివరకే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు వచ్చేశారు. మరోవైపు తాత్కాలికంగా సైనిక ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో పార్లమెంట్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారని వార్తా సంస్థ AFP రిపోర్ట్ చేసింది. నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో పార్లమెంట్ రద్దు చేయడం సైతం ఒకటని తెలిసిందే.
ఆందోళనకారులు విధ్వంసం
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల వారసులకు ఉద్యోగాలలో 30 శాతం జాబ్ రిజర్వేషన్ కోటాను పునరుద్ధరించాలని దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. దాతో జులై నెలలో దేశంలో నిరసన జ్వాలలు ప్రారంభమయ్యాయి. నిరసన తీవ్రరూపం దాల్చి, దాడులు ఆస్తుల ధ్వంసానికి దారి తీసింది. పోలీసులు సైతం కాల్పులు జరపడంతో కొందరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఓవరాల్ గా ఈ దాడులు, కాల్పుల్లో ఇటీవల చనిపోయిన వారి సంఖ్య 300 దాటినట్లు అధికారులు తెలిపారు. నిరసనకారుల డిమాండ్లకు తలొగ్గిన షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, ప్రాణహాని ఉందని భారత్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. అగర్తలా నుంచి న్యూఢిల్లీకి చేరుకుని ప్రభుత్వ పెద్దలను కలిశారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. చిట్టగాంగ్‌లోని 6 పోలీస్ స్టేషన్‌లను ఆందోళనకారులు ధ్వంసం చేసి, ఆపై నిప్పు పెట్టారు. దాంతో చిట్టగాంగ్ లో పరిస్థితి అదుపు తప్పింది.
ఢాకాలో పీఎంఓలో విధ్వంసం, కీలక ఫైల్స్ చోరీ
బంగ్లాదేశ్‌లో హింసాకాండ తీవ్రరూపం దాల్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయినా ఆందోళనకారులు శాంతించడం లేదు. ఆమె నివాసంలో అన్ని వస్తువులు లూటీ చేశారు. పార్లమెంట్, ప్రధానమంత్రి కార్యాలయం ధ్వంసం చేశారు. దేశానికి సంబంధించిన పలు కీలక ఫైళ్లను ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. హసీనా రాజీనామాతో బంగ్లా భవితవ్యం తేల్చడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానుంది.
బంగ్లాదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు సరిహద్దుల వద్ద భద్రతను పెంచింది. మరోవైపు ఆ దేశంలో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు. బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉండే అవకాశం ఉందని, వీరిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో జులైలోనే కొన్ని వేల మంది దేశానికి తిరిగొచ్చారని, మిగతా వారి గురించి బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు అయిన భారత హిందువుల గురించి ఆరా తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Also Read: బంగ్లాదేశ్‌కు ముందే ఆ సలహా ఇచ్చాం, అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నాం - జైశంకర్ కీలక వ్యాఖ్యలు