S Jaishankar on Bangladesh Crisis: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో తీవ్రమైన సంక్షోభం నెలకొన్న వేళ భారత్ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని విదేశీమంత్రిత్వ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు. మంగళవారం (ఆగస్టు 6) రాజ్యసభలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల కారణంగా షేక్ హసీనా భద్రతా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తాము భావిస్తున్నట్లుగా జైశంకర్ తెలిపారు. తాను భారత్‌కు వస్తానని సమాచారం ఇచ్చారని, అయితే, అందుకు తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని చెప్పారు. సోమవారం షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నట్లు జైశంకర్ వెల్లడించారు.


బంగ్లాదేశ్‌లో తీవ్రమైన గందరగోళానికి దారితీసిన విషయాలను కూడా జైశంకర్ ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికల తర్వాత అక్కడి రాజకీయాల్లో ఒక రకమైన అస్థిర వాతావరణం ఏర్పడిందని.. బంగ్లాదేశ్ రాజకీయ నేతల్లో విభజన ఏర్పడిందని అన్నారు. ఈ పరిస్థితులే గత జూన్ నెలలో విద్యార్థులు ప్రారంభమైన ఆందోళనను తీవ్రతరం చేశాయని అభిప్రాయపడ్డారు. ప్రజా భవనాలు, మౌలిక సదుపాయాలపై దాడులు.. ట్రాఫిక్, రైలు రోకోలతో హింస మరింతగా చెలరేగిందని తెలిపారు.


మేం సలహా ఇచ్చాం


ఈ విషయాన్ని భారత్ ముందే గుర్తించి.. సంయమనం పాటించాలని మేం సలహా ఇచ్చాం. తర్వాత జులై 21న సుప్రీంకోర్టు తీర్పుతో కూడా ప్రజా ఆందోళన వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత తీసుకున్న వివిధ నిర్ణయాలు, చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఈ దశలో జరిగిన ఆందోళన ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవాలనే మెయిన్ ఎజెండాగా మారింది. ఆగస్ట్ 4న జరిగిన పరిణామాలు చాలా తీవ్రమైన మలుపు తీసుకున్నాయి. దేశంలో హింస స్థాయులు మరింత పెరిగాయి. అధికారంలోని అవామీ లీగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన ఆస్తులు దేశవ్యాప్తంగా తగలబెట్టారు లేదా నాశనం చేశారు’’ అని జైశంకర్ తెలిపారు.


బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు


బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా మేం అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో 19 వేల మంది ఉన్నారు. వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పరిస్థితులు శ్రుతి మించుతున్నందున అక్కడి హైకమిషనర్‌ సూచన మేరకు చాలామంది విద్యార్థులు జులైలోనే మన దేశానికి తిరిగి వచ్చేశారు. ఢాకాలోని హైకమిషన్‌ తోపాటు చిట్టగాంగ్‌, రాజ్‌షాహీ, కుల్నార్‌, సిల్హేర్‌లో మన అసిస్టెంట్‌ హైకమిషన్‌లు ఉన్నాయి. వాటికి అక్కడి ప్రభుత్వం తగినంత భద్రత కల్పిస్తుందని అనుకుంటున్నాం. అక్కడ మైనార్టీలు అయిన హిందువుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం’’ అని జైశంకర్ రాజ్యసభలో వెల్లడించారు.