India-Bangladesh Government Crisis:  పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఏర్పడిన సంక్షోభం కారణం మన దేశంలో ఉత్పన్నయ్యే పరిణామాలు, బంగ్లాదే్శ్‌లో ఉన్న భారతీయుల భద్రత, అవసరమైతే వారిని స్వదేశానికి తీసుకు రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పాటు దాదాపుగా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని  ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి సమస్యలు రావని భావిస్తన్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. బంగ్లా సరిహద్దుల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఇతర భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని ఆల్ పార్టీ నేతలకు కేంద్ర విదేశాంగ మంత్రి చెప్పారు. 


భారతీయుల్ని తీసుకు రావాల్సినంత ఘోరమైన పరిస్థితులు లేవు ! 


ఇప్పటి వరకూ బంగ్లాదేశ్‌లో పన్నెండు నుంచి పదమూడు వేల మంది వరకూ భారతీయులు ఉంటారని అంచనా వేశారు. ప్రస్తుతానికి వారిని తరలించాల్సినంత ఘోరమైన పరిస్థితులు లేవని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది కానీ.. భారతీయులకు వచ్చిన సమస్యలేమీ లేవని చెబుతున్నారు.ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఎనిమిది వేల మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారు. షేక్ హసీనా విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.   







మూడు ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ 


ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.  ఈ విషయంలో విదేశాంగ మంత్రిని ఆయన మూడు కీలక ప్రశ్నలు వేశారు.  బంగ్లాదేశ్‌లో ఏర్పడిన సంక్షోభంలో విదేశీ శక్తుల హస్తం ఉందా అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ మీద భారత్ దీర్ఘ కాలిక ప్రణాళిక, బంగ్లాదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం విషయంలో మన వ్యూహం ఏమిటి వంటి అంశాలపై రాహుల్ గాంధీ జైశంకర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇతర పార్టీల నుంచి  హాజరైన వారు కూడా పలు సందేహాలకు సమాధానాలు తతెలసుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితుల షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. మా ప్రభుత్వం అవగాహన చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేం అండగా ఉంటామని జేడీ యూ తెలిపింది. 


పార్లమెంట్‌లో చర్చ లేనట్లే ! 


సమావేశం జరిగిన తీరు పట్ల విపక్ష పార్టీలన్ని సంతృప్తి చెందాయి. బంగ్లాదేశ్ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు కోరలేదని.. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.  హసీనా ఎక్కడకు వెళ్తారన్న అంశాన్ని ఆమె నిర్ణయించుకోవాల్సి ఉందని..  ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆమె  నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.