Myanmar millitary junta aircraft attack: మయన్మార్ పరిస్థితి అదుపు తప్పుతోంది. మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియా సాగెయింగ్ లోని కాంట్ బాలు టౌన్ షిప్ లో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడులు చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ఆర్మీ ఎయిర్ స్టైక్ చేయగా కనీసం 100 మంది మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సగయింగ్ ప్రాంతంలోని కాంత్ బాలు టౌన్‌షిప్‌పై మయన్మార్ సైన్యం జుంటా బాంబు దాడి చేయడంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
జుంటా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నిరసనకారులపై మయన్మార్ సైన్యం రెండు బాబులు జారవిడిచిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఆర్మీ జరిపిన ఈ బాంబు దాడిలో ‘చాలా మంది అమాయకులు మరణించారు. వీరిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు అందులోనూ గర్భిణీలు ఉన్నారని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇది దారుణమైన ఘటన అని సైన్యం చేసిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది. స్థానికంగా కొత్త ఆఫీసు ప్రారంభించనున్న సందర్భంగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడిన సమయంలో వారిపై జుంబా యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసి దాడి జరిపారని మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
ఫిబ్రవరి 2021లో మిలటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ లో వేలాదిగా ప్రజలు మరణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని ఆర్మీ పదవి నుంచి తొలగించింది. విచారణ పేరుతో ఆమెకు ఏకంగా 33 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. సూకీకి మద్దతు తెలిపిన వారిపై మయన్మార్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. ఎంతో మంది జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, పౌర హక్కుల కార్యకర్తలను ఖైదు చేసింది సైన్యం. మయన్మార్ లో జరుగుతున్న ఘటనల్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.
ఆగ్నేయాసియా దేశంరెండేళ్లుగా అస్థిరతతో అల్లాడిపోతోంది. ప్రస్తుతం అక్కడ ఆహారం సరిగా దొరకడం లేదు. ఇంధనం కొరత, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవు. అంగ్ సాన్ సూకీ నుంచి ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్లడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) సభ్యుడు రాయిటర్స్ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా ఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిపై యుద్ధ విమానాలు బాంబు దాడులు చేయడంతో పాటు కాల్పులు జరిపాయని తెలిపారు.