Americans want Trump to Lose says Kamala Harris in Her first interview | అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అక్రమ వలసలపై తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీసేందుకు మద్దతిస్తానని చెప్పిన హారిస్, తన ఉదారవాద లక్షణాలను మాత్రం విడిచిపెట్టలేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అమెరికన్లను, అమెరికన్ల శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని హారిస్ పిలుపునిచ్చారు.
అక్రమ వలసలకు వ్యతిరేకం
తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లోకి రిపబ్లికన్‌ను తీసుకుంటానని కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన చేశారు. అక్రమ వలసలపై ఉదారంగా వ్యవహరించానని తనపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చమురు వెలికితీతను నిషేధించబోనని ఆమె స్పష్టం చేశారు. తద్వారా పెన్సిల్వేనియో వివాదానికి ఆమె తెరదించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. గాజా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ నకు భారీ షాక్
డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ నాయకులు భారీ షాకిచ్చారు. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాయడం ట్రంప్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే వీరంతా జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో వీరంతా ఆయనకు అనుకూలంగా పనిచేసినవారే కావడం గమనార్హం. ఫ్యాక్స్ న్యూస్ కథనం ప్రకారం వీరంతా 2020లో కూడా ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. వీరంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మాణం చేశారు. ట్రంప్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తారని ఆ లేఖలో హెచ్చరించారు. కమలా హారిస్‌తో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నాయకులు ఇంకెవరూ ప్రస్తుతం లేరని వారు లేఖలో పేర్కొన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ మద్దతుదారులమతా ఒక్కటవుతామని హెచ్చరించారు.