Amazon Plane Crash:


విమానం క్రాష్..


కొలంబియాలోని అడవుల్లో నెల రోజుల క్రితం ఓ చిన్న విమానం క్రాష్ అయింది. ప్రమాద సమయంలో ఆ ప్లేన్‌లో నలుగురు చిన్నారులున్నారు. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 40 రోజుల తరవాత వాళ్లను గుర్తించారు. నలుగురు చిన్నారులూ బతికే ఉన్నారని వెల్లడించారు. "ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాం" అని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో వెల్లడించారు. ప్రస్తుతానికి వాళ్లు చాలా వీక్‌గా ఉన్నారని, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆ నలుగురి చిన్నారుల ఫోటోని కూడా షేర్ చేశారు. రెస్క్యూ టీమ్ వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. రెస్క్యూ టీమ్ కనిపించగానే చిన్నారులకు ప్రాణం లేచి వచ్చినట్టైందట. ఓ బాలుడు "దాహంగా ఉంది" అని దీనంగా అడిగాడట. వెంటనే ఆ సిబ్బందిలోని ఓ వ్యక్తి ఆ చిన్నారని చేతుల్లోకి తీసుకుని వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ ప్రజలందరినీ టెన్షన్ పెట్టిన ఈ ఘటన..చివరకు సుఖాంతమైంది. చీకట్లో పడి ఉన్న ఆ చిన్నారులను బయటకు తీసి రెస్క్యూ టీమ్ హెలికాప్టర్లలోకి ఎక్కించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మే 1వ తేదీ నుంచి ఈ నలుగురు పిల్లలూ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికో టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చిందని, అందుకే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ఓ మహిళ మృతి చెందారు. 






160 మంది సైనికుల అన్వేషణ


అడవి గురించి అణువణువూ తెలిసిన 70 మంది స్థానికులతో పాటు 160 మంది సైనికులు 40 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. విషసర్పాలు, మృగాలతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు ఈ అడవిలో ఉంటాయి. అన్ని ప్రమాదాల మధ్య నలుగురు చిన్నారులు ఇన్నాళ్ల పాటు బతికి ఉండటం మిరాకిల్ అనుకుంటున్నారు ఆ దేశ ప్రజలు. పాద ముద్రలు, డైపర్‌తో పాటు మరి కొన్ని వస్తువులు ఓ చోట పడి ఉండడాన్ని గమనించి ఆ పరిసరాల్లోనే వెతికారు. చివరకు వాళ్లను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకి 5 కిలోమీటర్ల దూరంలో వీళ్లను గుర్తించినట్టు సైనికులు వెల్లడించారు.